మోడీ కామెంట్స్‌పై బాబు రియాక్ట్ : తిట్టడానికే వచ్చారు – బాబు

విజయవాడ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను తిట్టడానికే ఏపీకి వచ్చారంటూ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మోడీ చేసిన విమర్శలపై బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా కేవలం తనను విమర్శించి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం విజయవాడలో లక్ష నివాస స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బాబు..మోడీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నల్లచొక్కా ధరించిన బాబు : –
మోడీ టూర్‌ని నిరసిస్తూ బాబు నల్లచొక్కా ధరించి అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ గడ్డపై నిలబడి అబద్దాలు చెబతున్నారని…కేవలం తనను తిట్టడానికే మోడీ ఢిల్లీ నుండి విమానం వేసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ విభజిస్తే..బీజేపీ దానిని సమర్థించిందన్న బాబు…ఏపీకి మోడీ అన్యాయం చేశారంటూ దుయ్యబట్టారు. ఏపీ రాష్ట్ర ప్రజలు మోడీని క్షమించరని..బాధ్యత లేకుండా నీరు – మట్టి తీసుకొచ్చి మొహాన కొట్టారని విమర్శించారు. మోడీని..గో బ్యాక్ అంటే గుజరాత్‌కి వెళ్లమని అర్థమన్నారు.
ఏపీపై మోడీ కక్ష : –
విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ తాను ఢిల్లికి 29 సార్లు వెళ్లినట్లు గుర్తు చేశారు. ఏపీకి న్యాయం చేస్తారనే బీజేపీ పొత్తు పెట్టుకోవడం జరిగిందని మరోసారి బాబు తెలిపారు. మోడీతో తనకు వ్యక్తిగత విబేధాలు లేవని..తల్లిని చంపి బిడ్డను తీశారన్న మోడీ…అధికారంలోకి వచ్చాక తల్లిలాంటి ఏపీపై కక్షకట్టారన్నారు. ప్రత్యేక హోదా 13 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తమకు ఎందుకివ్వరని ప్రశ్నించారు బాబు.
లెక్కలు చెప్పేందుకు సిద్ధం : –
కేంద్రం ఎంత నిధులు ఇచ్చిందో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన బాబు…రాష్ట్రంపై పెత్తనం చేస్తామంటే సహించమన్నారు. విద్యాసంస్థల కోసం రూ. 12 వేల కోట్లకు రూ. 7వందల కోట్లు మాత్రమే ఇచ్చారు…అయితే ఇక్కడ లెక్కలు చెప్పే బాధ్యత సీఐజీకి ఉందన్నారు. ఎక్కడకు వెళ్లినా మోడీ గో బ్యాక్ అంటున్నారని…ఆయనకు ప్రధాన మంత్రి సీట్లో కూర్చొనే అర్హత లేదన్నారు బాబు.