ఏపీకి రాజధాని యోగం లేదా ?

ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని యోగం లేదా..? తరచూ మారిపోవాల్సిందేనా..? అప్పటి మద్రాస్ నుంచి ఇప్పటి అమరావతి వరకూ జరిగిన.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి రావడంతో.. అమరావతి భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది. అసలు ఆంధ్రుల రాజధానిపై ఎందుకింత గందరగోళం..?
అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటనే.. అమరావతిలో అగ్గిరాజేసింది. రాజధాని నిర్వీర్యం అయ్యిపోయిందన్న ఆందోళనను పెంచేసింది. రాజధానిపై అధ్యయన కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం అంటూ సీఎం జగన్ స్పష్టంగా ప్రకటించినా.. ప్రభుత్వ ఉద్దేశం ఏమిటన్నది ఈ ప్రకటనతోనే తేలిపోయింది. అమరావతిలో పూర్తిస్థాయి రాజధాని ఉండదన్నది స్పష్టమైపోయింది. కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ ఉండొచన్న ప్రకటనతో.. అదే రాజధానిగా చెలామణీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలోపే.. రాజధానిగా అమరావతి పేరు చెరిగిపోతుండడం.. ఆ ప్రాంత వాసులను అవాక్కయ్యేలా చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని మారడం.. ఇదే తొలిసారి కాదు.. అసలు చరిత్రలోనే.. శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్‌కు లేదంటే అతిశయోక్తి కాదు. బ్రిటీష్ పాలనలో మద్రాసు రాజధానిగా ఉంటే.. స్వాతంత్ర్యం వచ్చాక, ఆంధ్రరాష్ట్రం సిద్ధించడంతో కర్నూలు రాజధాని అయ్యింది. మూడేళ్లలోపే.. ఆంధ్రరాష్ట్రం.. హైదరాబాద్ రాష్ట్రం విలీనమై.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో.. హైదరాబాద్ రాజధాని అయ్యింది. కానీ.. తొలి దశ తెలంగాణ ఉద్యమంతోనే.. హైదరాబాద్ తమది కాదన్న భావన జనంలో మొదలయ్యింది. ఆ ఉద్యమాన్ని కేంద్రం అణిచివేయడంతో పరిస్థితులు సద్దుమణిగినా.. భవిష్యత్తులో ఏమవుతుందో అన్న అయోమయం మాత్రం అలానే ఉండిపోయింది. తెలంగాణ మలి దశ ఉద్యమంతో రాష్ట్రం మళ్లీ రెండుగా విడిపోవడంతో.. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం వెదుక్కోవాల్సి వచ్చింది. ఎన్నో చర్చలు.. ఎన్నో ఊహాగానాల మధ్య.. అమరావతిని రాజధానిగా ప్రకటించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. హైదరాబాద్‌తో ముడిపడిన బంధాన్ని భారంగానే వదులుకున్న ఆంధ్రులు.. అమరావతితో ఇక శాశ్వత రాజధాని ఉంటుందన్న నమ్మకానికి వచ్చారు.
దేశంలోనే ఎక్కడా లేనట్లుగా రాజధానిని నిర్మిస్తామంటూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటన చేయడంతో.. 33 వేల ఎకరాలకు పైగా విలువైన భూములను రాజధాని కోసం సమర్పించారు రైతులు. పరిహారంగా డబ్బులకు బదులు.. అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించేలా ఒప్పందం చేసుకుంది అప్పటి ప్రభుత్వం. కానీ.. ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూడడం… వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని దక్కించుకోవడంతో.. అమరావతిపై ఆందోళన మొదలయ్యింది. అనుకున్నట్లుగానే.. రాజధానిని మార్చేందుకు రెడీ అయ్యింది జగన్ సర్కార్. ఇప్పటికే జీఎన్ రావునేతృత్వంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ తన నివేదికను సీఎం జగన్ కు అందచేసింది. డిసెంబర్ 27 న కేబినెట్ భేటీలే నివేదికరపై చర్చించిన తర్వాత సీఎం రాజధాని మార్పుపై అధికారిక ప్రకటన వెలువరించనున్నారు.
రాజధాని కోసం పోరాటం.. ప్రతీ సారీ అదే.. అప్పుడు మద్రాస్ కోసం.. మధ్యలో హైదరాబాద్ కోసం.. ఇప్పుడు అమరావతి కోసం.. తరాలు మారుతున్నా.. ప్రాంతాలు మారుతున్నా.. రాజధాని రగడ మాత్రం ఆగడం లేదు. ఈ సారన్నా ఈ పోరాటానికి విరామం వస్తుందన్న నమ్మకం లేదు.. ప్రతీ సారి రాజీపడడం.. రాజకీయాలతో.. రగడ మొదలవడం రోటీన్‌గా జరిగిపోతోంది.
ఆంధ్ర రాజధాని చరిత్ర
ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం.. ప్రత్యేక రాజధాని ఉండాలంటూ మొదలైన పోరాటానికి వందేళ్లకు పైనే చరిత్ర ఉంది. మద్రాస్ ప్రావిన్స్‌లో భాగంగా ఆంధ్రప్రాతం ఉన్నప్పుడే ఈ నినాదానికి బీజం పడింది. 1912 లో నిడదవోలులో జరిగిన సదస్సులోనే తొలిసారిగా ఈ కోరిక వ్యక్తమైంది. ఆ తర్వాత సంవత్సరం బాపట్లలో తిరిగి సమావేశమైన ఆంధ్ర ప్రాంతపు నాయకులు మరోసారి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ బలంగా వినిపించారు. అయితే విచిత్రంగా ఈ కోరికను అప్పట్లో మహాత్మాగాంధీ ఖండించారు. అలా ఆంధ్రులకు ప్రత్యేక రాజధాని అనే కోరికను కాదన్న వారి జాబితాలో మహాత్మాగాంధీ కూడా ఉన్నారు.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని.. తెలుగు ప్రాంతాల్లో రాజధాని ఏర్పడాలనే కోరికే ఆంధ్ర మహాసభ ఏర్పాటుకు దారి తీసింది. 1917 లో ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ సంఘం ఏర్పడింది. మహాత్మా గాంధీ ఏ విషయమూ తేల్చకపోయే సరికి ఆంధ్ర కాంగ్రెస్ కమిటి, తమిళనాడు కాంగ్రెస్ కమిటి రెండూ చెన్నై కేంద్రంగానే పనిచేయడం ప్రారంభించాయి. ఆ సమయంలోనే ఒడిసా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రుల కోరిక మాత్రం అప్పటికీ నెరవేరలేదు.
సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో ఆంధ్రులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడంతో.. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర డిమాండ్‌ను బ్రిటీష్ పాలకులు తొక్కిపెట్టారు. 1935 ఇండియా చట్టంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి సూత్రప్రాయంగానైనా ప్రస్తావించలేదు. అయినా ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని వదలిపెట్టలేదు ఆంధ్ర నేతలు.. అయితే.. ప్రత్యేక రాష్ట్ర విషయంలో సీమనేతలకు.. ఆంధ్ర ప్రాంత నేతలకు మధ్య విబేధాలుండేవి. రాజకీయంగా, విద్యాపరంగా చైతన్యవంతమైన ఆంధ్ర ప్రాతంతో కలిస్తే, తాము అన్యాయానికి గురవుతామన్న వాదన సీమ నేతలది. దీంతో.. 1937 నవంబర్ పద్నాలుగున కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు నివాసం.. శ్రీబాగ్‌లో సీమాంధ్ర నాయకుల సమావేశమయ్యారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కనుక ఆ ప్రాంత అభివృద్దికి కొన్ని ఖచ్చితమైన హామీలు కోరారు ఆ ప్రాంత నాయకులు. ఇదే శ్రీబాగ్ ఒప్పందంగా చెలామణీలోకి వచ్చింది.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంతంలో ఓ విశ్వవిద్యాలయం రావాలి. అలాగే సీమ ప్రాంతపు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మొదటి పది సంవత్సరాలలోనూ ప్రాధాన్యత ఇవ్వాలి. రాజధాని, హైకోర్టులలో సీమ ప్రజలు ఏది కోరుకుంటే అది ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. అయితే.. ఈ కోరిక స్వాతంత్ర్యం సిద్ధించే వరకూ నెరవేరలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఆంధ్ర ప్రాంతపు నాయకులతో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేకంగా సమావేశమై బళ్లారితో కలిపి పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు తాను తోడ్పాటును అందించగలనని ప్రకటించారు. అయితే నెహ్రూ ప్రతిపాదనను టంగుటూరి ప్రకాశం పంతులు తీవ్రంగా వ్యతిరేకించారు. మద్రాసు తెలుగువారిదే అనీ … మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలనీ డిమాండ్ చేశారు.
మద్రాసు కోరిక రిజర్వ్ లో పెట్టుకుంటాం … ముందు రాష్ట్రం ఇవ్వండి మద్రాసు విషయం తర్వాత చూసుకుందాం అని ఆచార్య రంగా ప్రతిపాదించారు. ఈ రెంటినీ నెహ్రూ పట్టించుకోలేదు. చివరకు మద్రాసు రాజధానిగా ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ పొట్టి శ్రీరాములు నిరాహారదీక్షకు దిగి అమరులయ్యారు. ఆ తర్వాత చెలరేగిన ఆందోళనలతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మద్రాసు డిమాండ్‌ను పక్కన పెడితే.. ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించింది. దీనికి నేతలు అంగీకరించడంతో.. 1953 అక్టోబర్1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. శ్రీబాగ్ ఒప్పందం మేరకు.. కర్నూలులో రాజధాని.. గుంటూరులో హైకోర్టు ఏర్పాటయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం.. మద్రాస్‌ను వదులుకోవాల్సి వచ్చింది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడేనాటికే.. బెజవాడ పెద్ద నగరం.. పైగా… రాష్ట్రం మధ్యలో ఉంది. అయినా.. రాజధాని కర్నూలుకు వెళ్లడం వెనుక ఆసక్తికరమైన చరిత్రే ఉంది. చివరకు.. అక్కడినుంచి హైదరాబాద్‌కూ తరలిపోవడంతోనూ.. ఎన్నో మతలబులు.. మరెన్నో రాజకీయాలు..
కర్నూలు రాజధాని
ఆంధ్రరాష్ట్రానికి కర్నూలు రాజధాని కావడం వెనుక ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ సమయంలో సాగిన విస్తృతమైన చర్చల్లో బెజవాడ ప్రాంతంలో రాజధాని.. కర్నూలు కు హైకోర్టు అనే వాదన కూడా వినిపించింది. అయితే … అప్పటి కృష్ణా గుంటూరు జిల్లాల రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి ఇష్టపడలేదు. మూడు పంటలు పండే పొలాలను ఎలా ఇస్తాం అంటూ ప్రశ్నించారు. అయితే.. బెజవాడలో అప్పట్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అక్కడే రాజధానిని పెట్టాలంటూ.. కమ్యూనిస్టులు బలంగా వాదించారు. కానీ.. అలా చేస్తే.. భవిష్యత్తులో రాజకీయంగా మరింత బలపడతారేమో అన్న అనుమానంతో.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు ఆచార్య రంగా, ప్రకాశం పంతులు లాంటి నేతలు. రైతుల సమస్యను పరిష్కరించడం, కమ్యూనిస్టులకు కళ్లెం వేయడం కోసం.. రాజధాని కర్నూలుకు మారిపోయింది. హైకోర్టు.. గుంటూరుకు చేరింది.
కర్నూలులో సరైన వసతులు లేకపోవడంతో.. టెంట్లతోనే పాలన మొదలయ్యింది. మరోవైపు… హైదరాబాద్ రాష్ట్రంతో ఆంధ్రరాష్ట్రాన్ని విలీనం చేయాలన్న విశాలాంధ్ర ఉద్యమం తెరపైకి వచ్చింది. ఆ సమయంలో కర్నూలుకు వచ్చిన ప్రధాని నెహ్రూ.. దీన్ని విస్తరణ వాదంతో పోల్చడం పెద్ద దుమారాన్ని రేపింది. నెహ్రూ ప్రకటనను ప్రకాశం పంతులే కాదు అప్పటి కమ్యునిస్టు పార్టీ నాయకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు కూడా తీవ్రంగా ఖండించారు. కలసి ఉండాలనే తెలుగు వారి కోరిక ప్రధానికి విస్తరణ వాదంగా కనిపించడం దారుణమని చెప్తూ విశాలాంధ్ర ఆవిర్భావానికి సీపీఐ మద్దతు తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిస్తే విశాలమైన హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకోవచ్చంటూ.. ఈ ఉద్యమానికి జనం నుంచి కూడా మద్దతు కూడగట్టారు. రెండు రాష్ట్రాల శాసనసభలు విలీనానికి అనుకూలంగా తీర్మానాలు చేయడంతో.. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధాని మారింది.
విశాలాంధ్ర నినాదంతో హైద్రాబాద్ రాజధానిగా ఏర్పడినా.. ప్రశాంతత మాత్రం లేదు. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలయ్యింది. తెలంగాణపై, ఆంధ్రానేతల పెత్తనాన్ని నిరసిస్తూ.. తెలంగాణ ప్రజాసమితి పెద్ద ఎత్తున ఉద్యమించింది. అయితే.. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వాలు అణిచివేయగలిగినా.. 1972లో ముల్కీ నిబంధనల విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రాంతంలో చిచ్చు రాజేసింది. జైఆంధ్ర ఉద్యమానికి నాంది పలికింది. సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలు సైతం.. జైఆంధ్ర ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రత్యేక ఆంధ్రకోసం ఉధృతంగా సాకిన ఉద్యమాన్ని.. ఇందిరాగాంధీ అణిచివేయడంతో.. ఈ అంశం మరుగున పడింది. కొంతకాలం అంతా సజావుగానే ఉన్నా.. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలవడంతో.. హైదరాబాద్ మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంతా సిద్ధమైన తరుణంలో హైదరాబాద్‌ను వదులుకోవడానికి ఆంధ్రప్రాంత నేతలు సిద్ధపడలేదు. భాగ్యనగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. కానీ.. ఇవేవీ నెరవేరలేదు. హైదరాబాద్‌ను వదిలిపెట్టి.. ఆంధ్రలోనే మరో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలంటూ కేంద్రం తేల్చేసింది. హైదరాబాద్ రాజధానిగా 58 ఏళ్లపాటు ఉండడంతో.. సీమాంధ్రులు చాలామంది ఇక్కడే స్థిరపడిపోయారు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం తరలివచ్చారు. కానీ.. రాష్ట్ర విభజన జరగడంతో.. ఉద్యోగుల్లో చాలా మంది తిరిగి అమరావతికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయంలో.. జీఎస్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం సెక్రటేరియట్ మార్పు ఓ రకంగా ఉద్యోగులకు ఇబ్బందికర పరిణామమే. సరిగ్గా 1953 లో కర్నూలుకు వచ్చి… మూడేళ్లకే హైదరాబాద్‌కు మారినట్లు… ఇప్పుడు కూడా.. అమరావతికి వచ్చిన నాలుగేళ్లలోనే.. మరోచోటుకు మారాల్సి వస్తోంది.