సచివాలయ నిర్మాణానికి నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్

పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అంశంలో దూకుడు మీద ఉన్న జగన్ సర్కార్ కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేసే దిశగా జనవరి31న ఆదేశాలు జారీచేసింది. ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో పెండిగ్ లో వుండగానే జగన్ సర్కార్ ఇప్పుడు మళ్లీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పరిపాలనా రాజధానిగా గుర్తించిన విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణానికి 19.73 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం లేటెస్ట్ గా విడుదల చేసింది. టవర్ బి నిర్మాణానికి ఐటీ శాఖకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో విశాఖ మిలీనియం టవర్స్ నుంచి సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది. కర్నూలు లో ఏర్పాటు చేయబోయే న్యాయరాజధానిలో భాగంగా … రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని వెలగపూడి నుంచీ కర్నూలుకు తరలించినట్లైంది. ఇకపై ఆ కార్యాలయాలు కర్నూలు నుంచీ పనిచేయనున్నాయి.
మరోవైపు ఈ నెలాఖరులోపు కీలకమైన కార్యాలయాలను కూడా విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. దీనిపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ కార్యాలయ సిబ్బందికి మౌఖికంగా సమాచారం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. ప్రస్తుతం విజయవాడలోని ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్న అడ్మిన్ బ్లాకులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ కార్యాలయం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వస్తాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి ఏపీలో ఆందోళనలు మొదలయ్యాయి. నెలలు గడుస్తున్నా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.