ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ బౌన్స్

అమరావతి : ఏపీలో సీఎం రిలీఫ్ పండ్ కింది ఇచ్చిన చెక్ బౌన్స్ అవటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వంలో ఏ శాఖలో అయినా నిధుల కొరత ఉంటుందేమో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కు నిధుల కొరత ఉండదు. ఇప్పిటికే ఏపీ ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను సైతం పక్క దారి పట్టించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 మార్చిలో ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు నిధులు లేక పోవటంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.
వివరాల్లోకి వెళితే … కర్నూలు జిల్లా, పాణ్యం నియోజక వర్గం, నాగిరెడ్డి కాలనీ కి చెందిన గంగాధర రెడ్డి భార్య జ్యోతికి అనారోగ్యం కారణంగా 2018 నవంబర్ లో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్కు ఆరోగ్యశ్రీ సదుపాయం లేకపోవటంతో రూ. 56 వేల రూపాయలు అప్పుచేసి ఆపరేషన్ చేయించారు. ప్రభుత్వ సహాయం కోసం పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ఏరాసు ప్రతాప రెడ్డి ద్వారా నవంబర్ 26న సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లయ్ చేశారు. అందుకు సంబంధించి 2019 మార్చి 15న రూ.26,920 లు మంజూరు చేసినట్లు సమాచారం వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కును, ఏపీలో పోలింగ్ కు 2 రోజుల ముందు ఏప్రిల్ 9వ తేదీన ఏరాసు ప్రతాప రెడ్డి బాధిత కుటుంబానికి అందచేశారు. కాగా …వారు 10 వ తేదీ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా …15 వ తేదీని బ్యాంకు అధికారులు సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలో నిధులు లేవని లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. అప్పుచేసి ఆపరేషన్ చేయించాం. సీఎం రిలీఫ్ పండ్ ద్వారా వచ్చేదానితో కొంత మేర అప్పు తీర్చవచ్చనుకున్నాము. నిధులు లేకపోవటంతో ఏంచేయాలో అర్ధం కావటంలేదని గంగాధర్ రెడ్డి ఆవేధన వెలిబుచ్చారు.