ఆ రెండు కులాలకే ఎమ్మెల్యే ఛాన్స్‌.. రామచంద్రపురంలో ఆసక్తికర రాజకీయం!

గతంలో ఇలా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలవడం.. ఇక్కడ సామాజిక వర్గ ప్రాబల్యానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు.

ఆ రెండు కులాలకే ఎమ్మెల్యే ఛాన్స్‌.. రామచంద్రపురంలో ఆసక్తికర రాజకీయం!

Caste Politics in Ramachandrapuram

Ramachandrapuram Politics : అసెంబ్లీ ఎన్నికలు అంటే అభివృద్ధి, సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకత, అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాలు ఇలా.. ఎన్నో అంశాలపై తీర్పుగా చెప్పొచ్చు. కానీ, గోదావరి తీరంలో ఓ నియోజకవర్గంలో మాత్రం ఎన్నికలంటే రెండు సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరాటమే.. ఒకసారి ఓ సామాజిక వర్గం గెలిస్తే.. మరోసారి మరో సామాజికవర్గం అభ్యర్థి విజయం సాధిస్తారు. పోటీ చేసే నేతలు, వారి పార్టీలు ఎవరూ చూడరు.. తమ సామాజికవర్గ నేతకు అవకాశం ఇచ్చారా? లేదా? అన్నదే అక్కడి లెక్క.

ఆ రెండు సామాజికవర్గాల మధ్యే పోటీ..
గోదావరి జిల్లాల్లో కులసమీకరణలు, క్యాస్ట్‌ బేస్డ్‌ పాలిటిక్స్‌ ఎక్కువని చెబుతుంటారు పరిశీలకులు. దీనికి రామచంద్రపురం అసెంబ్లీ స్థానాన్ని ఉదాహరణగా చూపుతారు. ఆ నియోజకవర్గంలో రెండు సామాజికవర్గాల మధ్య పోటీయే ఎక్కువగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో కాపులు, శెట్టిబలిజ సామాజికవర్గాల ఆధిపత్యమే ఎక్కువ. దీంతో ఈ సీటు దక్కించుకోడానికి ప్రధాన పార్టీలు క్యాస్ట్‌ పాలిటిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాయని చెబుతుంటారు.

స్వతంత్రులుగా బరిలోకి విజయం సాధిస్తారు..
రామచంద్రపురం నియోజకవర్గంలో గత ఏడు ఎన్నికలు పరిశీలిస్తే కాపు సామాజిక వర్గ నేతలు నాలుగుసార్లు, శెట్టి బలిజ సామాజిక వర్గం నేతలు మూడుసార్లు గెలిచారు. ఒక పార్టీ కాపులకు అవకాశమిస్తే.. ఇంకోపార్టీ శెట్టి బలిజలకు తప్పకుండా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలాకాదని ఈ రెండు సామాజికవర్గాల్లో ఒక కులం చెందిన వారికే రెండు పార్టీలూ టికెట్లు ఇస్తే.. మరో సామాజికవర్గం నేతలు స్వతంత్రులుగా బరిలోకి విజయం సాధిస్తుంటారు. గతంలో ఇలా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలవడం.. ఇక్కడ సామాజిక వర్గ ప్రాబల్యానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు.

Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి ఎవరు?
రామచంద్రాపురంలో సామాజికవర్గాల లెక్కలన్నీ పరిశీలించిన వైసీపీ అధిష్టానం.. ఈసారి శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సూర్యప్రకాశ్‌కు టికెట్‌ ఖరారు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా శెట్టి బలిజ సామాజికవర్గమే. కానీ, నియోజకవర్గ బదిలీల్లో మంత్రి వేణును రాజమండ్రి రూరల్‌కి పంపింది వైసీపీ హైకమాండ్‌. అంటే ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు శెట్టిబలిజలకు సీట్లు ఇచ్చిన వైసీపీ.. యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు పంపింది. దీంతో ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

టీడీపీలోనే ముగ్గురు నేతల మధ్య పోటీ..
గత ఎన్నికల్లో పార్టీల నిర్ణయాలను పరిశీలిస్తే ఒక పార్టీ శెట్టి బలిజలకు అవకాశం ఇస్తే.. మరో పార్టీ కాపులకు సీటు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి.. దీంతో ఇప్పుడు ప్రతిపక్ష కూటమి నుంచి కాపు నేతలే బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే టీడీపీ-జనసేన కూటమి ఈ ఈక్వేషన్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా? అన్నదే సస్పెన్స్‌కు దారితీస్తోంది. ఎందుకంటే ఈ రెండుపార్టీల నుంచి రామచంద్రపురం ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగానే ఉంది.

Also Read : సీఎం జగన్ ఆ ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా? ఆందోళనలో మంత్రి బొత్స మేనల్లుడు

టీడీపీలో రెడ్డి సుబ్రహ్మణ్యం, కాదా వెంకటరమణ టికెట్‌ ఆశిస్తుండగా, ఈ ఇద్దరు శెట్టిబలిజ సామాజికవర్గ నేతలు కావడంతో కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఇక ఇదే సీటును ఆశిస్తూ కాపు నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రధాన అనుచరుడు రేవు శ్రీను తాజాగా టీడీపీలో చేరారు. దీంతో రామచంద్రాపురం సీటుపై టీడీపీలోనే ముగ్గురు నేతల మధ్య పోటీ కనిపిస్తోంది.

Also Read : శ్రీకాకుళం టీడీపీలో గ్రూప్‌వార్.. ఆందోళనలో కార్యకర్తలు

ఇక జనసేన నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల దొరబాబు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. అంటే మొత్తం ఐదుగురు నేతలు రామచంద్రాపురంలో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఐదుగురులో ఇద్దరు శెట్టి బలిజ సామాజివర్గం నేతలు అయితే మిగిలిన ముగ్గురు కాపు సామాజికివర్గానికి చెందిన వారు. వైసీపీ శెట్టి బలిజలకు అవకాశం ఇచ్చినందున టీడీపీ-జనసేన కూటమి కాపులకు చాన్స్‌ ఇవ్వాలనుకుంటే ముగ్గురి మధ్యే పోటీ కనిపిస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరి టీడీపీ కాగా, మిగిలిన ఇద్దరు జనసేన నేతలు. ఐతే పొత్తుల్లో ఈ సీటు ఏ పార్టీకి కేటాయిస్తారనేది కూడా ఇక్కడ ప్రధానాంశమే. ఏదిఏమైనా రామచంద్రాపురం ఎమ్మెల్యేని నిర్ణయిస్తున్న రెండు ప్రధాన సామాజికవర్గాల్లో ఎవరిని ఎంచుకుంటారనేది మాత్రమే ఉత్కంఠకు దారితీస్తోంది.