సీఎం జగన్ ఆ ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా? ఆందోళనలో మంత్రి బొత్స మేనల్లుడు

వైసీపీ అధికారంలోకి రాకపూర్వం నీడనేతగా, తెరచాటు రాజకీయాలు మాత్రమే చేసిన చిన్నశ్రీను.. 2019 తర్వాత విజయనగరం జిల్లాలో ప్రధాన నేతగా ఎదిగారు.

సీఎం జగన్ ఆ ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా? ఆందోళనలో మంత్రి బొత్స మేనల్లుడు

Chinna Srinu Future

Chinna Srinu : పార్టీ పదవితో ప్రమోషన్‌.. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌పై నో ఇన్‌ఫర్మేషన్‌.. సీఎం దగ్గర మంచి మార్కులే ఉన్నా.. ఆశపెట్టుకున్న పదవి దక్కుతుందా లేదా అన్నదే టెన్షన్‌.. విజయనగరం జిల్లాలో కీలక నేత.. మంత్రి బొత్స మేనల్లుడు చిన్నశ్రీను పరిస్థితి ఇది.. ప్రస్తుతం విజయనగరం జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న చిన్నశ్రీను.. వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు.. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు అందక ఆయన మద్దతుదారులు టెన్షన్‌ పడుతున్నారు.

ఉత్తరాంధ్రలో సగం ప్రాంతంపై ఆయనకు ఆధిపత్యం..
ఉత్తరాంధ్రలో వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మూడు ఉమ్మడి జిల్లాలోనూ ఆ పార్టీకి బలమైన నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇదే సమయంలో విజయనగరం, విశాఖ జిల్లాలపై మంత్రి బొత్స పెత్తనం కొనసాగుతోంది. ఇప్పటికే మంత్రి బొత్స సతీమణికి విశాఖ పార్లమెంట్‌ సమన్వయకర్తగా ప్రకటించగా, అదనంగా ఆయన మేనల్లుడు విజయనగరం జడ్పీ చైర్మన్‌ చిన్నశ్రీనుకు కొత్తగా పార్టీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టింది.

పార్టీ పరంగా ఇప్పటివరకు ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న చిన్నశ్రీను. కొత్త బాధ్యతలతో విజయనగరం, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు అరకు పార్లమెంటు పరిధిలో కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ అసెంబ్లీ స్థానాలను పర్యవేక్షిస్తారు. అంటే ఉత్తరాంధ్రలో సగం ప్రాంతంపై ఆయనకు ఆధిపత్యం కట్టబెట్టింది పార్టీ.

Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

ఇప్పుడు కాకపోతే.. టెన్షన్ లో చిన్నశ్రీను అభిమానులు
కీలకమైన పదవి వరించినా.. చిన్నశ్రీను అభిమానులు మాత్రం అసంతృప్తితోనే ఉంటున్నారని చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. పార్టీలో ప్రమోషన్‌ ఇచ్చినా.. తమ నేత ఆశించిన పదవులపై క్లారిటీ లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌ పదవిలో ఉన్న చిన్నశ్రీను వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని ఏదో నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉబలాటపడుతున్నారు. అసెంబ్లీ కుదరదంటే పార్లమెంట్‌కు పోటీ చేయాడానికైనా సై అంటున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ పోటీ చేసే అవకాశం రాదన్నట్లు చిన్నశ్రీను అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు.

ఆ ఒక్క కుటుంబానికే 5 టికెట్లా?
విజయనగరం జిల్లాలో ఇప్పటికే మూడు స్థానాల్లో మంత్రి బొత్స కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు చోట్ల మళ్లీ వారే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక బొత్స కుటుంబానికి అదనంగా విశాఖ ఎంపీ సీటు కూడా దక్కింది. ఈ లెక్కలన్నీ పరిశీలించిన వైసీపీ అధిష్టానం చిన్నశ్రీను టికెట్‌పై ఏమీ తేల్చడం లేదు. చిన్నశ్రీనుకు టికెట్‌ ఇస్తే బొత్స కుటుంబానికే ఐదు టికెట్లు ఇచ్చినట్లు అవుతుంది.

రాష్ట్రంలో మరే నేత కుటుంబానికి ఇన్ని టికెట్లు లేకపోవడంతో హైకమాండ్‌ చిన్నశ్రీను పోటీపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. చిన్నశ్రీను ఒత్తిడికి తలొగ్గి ఆయనకు అవకాశం ఇస్తే.. రాష్ట్రంలో మరిన్ని డిమాండ్లు వచ్చే అవకాశం ఉందన్న.. ఆచితూచి వ్యవహరిస్తోంది వైసీపీ అధిష్టానం.

విజయనగరం జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టుసాధించిన చిన్నశ్రీను.. ముఖ్యమంత్రి జగన్‌కు కూడా అత్యంత సన్నిహితుడు. జగన్‌ పాదయాత్ర సమయంలో బాగా దగ్గరయిన చిన్నశ్రీను.. జగన్‌ ప్రోద్బలంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లో పట్టు బింగించారంటున్నారు పరిశీలకులు. వైసీపీ అధికారంలోకి రాకపూర్వం నీడనేతగా, తెరచాటు రాజకీయాలు మాత్రమే చేసిన చిన్నశ్రీను.. 2019 తర్వాత విజయనగరం జిల్లాలో ప్రధాన నేతగా ఎదిగారు.

Also Read : వైసీపీ ఏడో జాబితాపై ఉత్కంఠ.. టెన్షన్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు

ఈ క్రమంలోనే ఈసారి చట్టసభలకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం చిన్నశ్రీను మనోగతాన్ని అర్థం చేసుకుని అవకాశం ఇస్తుందా? లేక నెక్ట్స్‌ టైమ్ బెటర్‌ లక్‌ అంటూ వాయిదా వేసేస్తుందా? చూడాలి.