అమరావతిని ఉత్తుత్తి రాజధాని చేశారు : బీజేపీ ఎంపీ జీవీఎల్

  • Published By: chvmurthy ,Published On : January 21, 2020 / 07:25 AM IST
అమరావతిని ఉత్తుత్తి రాజధాని చేశారు :  బీజేపీ ఎంపీ జీవీఎల్

Updated On : January 21, 2020 / 7:25 AM IST

అమరావతి రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీలు రెండూ తమ స్వార్ధ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి రాజధాని విషయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. అవినీతిమయం చేశాయి అనటానికి నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చే నిదర్శనమని జీవీఎల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న 3 రాజధానుల ప్రకటన మిధ్య మాత్రేమే నని, కాల్పితం, బోగస్ గా ఉందని, మీరు చేసిన ప్రకటన చూస్తే 3 రాజధానులు ఉన్నట్టుగా లేదని అంతా ఉత్తుత్తి రాజధానిలా ఉందని విమర్శించారు.  

రాష్ట్ర  ప్రభుత్వం చేసిన ప్రకటన చూస్తుంటే విశాఖపట్నాన్నే రాజధానిగా చేస్తున్నట్లు ఉందని అన్నారు. అమరావతి ప్రాంతంలో అసెంబ్లీ ఉన్నంత మాత్రాన అది రాజధానికాదని  జీవీఎల్ చెప్పారు. హై కోర్టును రాయలసీమ లో పెట్టాలని మొదట బీజేపీ ప్రతిపాదించిందని.. అలా కూడా మీరు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

 

కేంద్రం అనుమతితోనే  రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని తరలిస్తోందని…గత కొద్ది రోజులుగా మీడియాలో తప్పుడు  కధనాలు వస్తున్నాయని అవి మీరు రాయిస్తున్నారో…. టీడీపీ వారు రాయిస్తున్నారో తెలియదు కానీ..దీన్ని కేంద్రానికి ఆపాదించాలనే దురుద్దేశ ధోరణి రెండు పార్టీల్లోనూ కనిపిస్తోందని జీవిఎల్ అన్నారు. తాము తీసుకున్ననిర్ణయాలను సమర్ధించుకోలేక వైసీపీ, ఇలాంటి ప్రకటన చేస్తోందా…. లేక తమ చేతకాని తనాన్ని కేంద్రంపై నెట్టాలని టీడీపీ చూస్తోందో…రెండు పార్టీలు చెప్పాలని ఆయన డిమాండ్  చేశారు.  

రాజధాని అంశంపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని…రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని..ఇంతకు ముందు శివరామకృష్ణన్ కమిటీ ఇక్కడ రాజధాని వద్దని చెప్పినా  అమరావతిలో  రాజధానిని టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తుంటే కేంద్రం ఓకే చెప్పిందని అన్నారు. మేము పెద్దన్న పాత్ర పోషిస్తే..టీడీపీ దద్దమ్మపాత్ర పోషిస్తుందా అని జీవీఎల్ ఘాటుగా వ్యాఖ్యానించారు.  

23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను పెట్టుకుని టీడీపీ పేలవంగా  పోరాటం చేస్తోందని అన్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇన్ని ఆధారాలతో అసెంబ్లీలో చెప్పిన ప్రభుత్వం  అక్రమార్కులపై  కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. 

అక్రమాలకు పాల్పడిన వారందరిపై జనవరి 22వ తేదీలోగా ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే అందుకు వైసీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడు 33 వేల ఎకరాలు భూసేకరణ చేపట్టానని గొప్పలు చెపుతున్నారు, కానీ…. నాలుగేళ్లలో సరిగ్గా నాలుగు భవనాలు కూడా నిర్మాణం చేపట్టలేక పోయారని ఆరోపించారు.

చంద్రబాబు చేతకాని తనాననికి ఇంతకన్నా నిదర్శనం ఏమీ కావాలి. 5 ఏళ్లలో 5 భవనాలు కట్టలేని చంద్రబాబు చరిత్రలో చేతకాని బాబులా మిగిలి పోయారని జీవీఎల్ ఎద్దేవా చేశారు.  కాకమ్మ కబుర్లు చెప్పకుండా, దద్దమ్మ  వ్యవహారాలు చెప్పకుండా  రాజకీయంగా ఎలాంటి  పోరాటం చేస్తారో టీడీపీ చెప్పాలని డిమాండ్ చేశారు.  బీజేపీ త్వరలో జనసేనతో కలిసి ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని జీవిఎల్ తెలిపారు.