కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ? జగన్‌కు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్లాన్..!

బీజేపీకి ఓ అద్భుతమైన అలవాటు ఉంది. తనకు అవసరం అనుకునే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి పాగా వేసేయాలని చూస్తుంది. అక్కడున్న ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుంటుంది. వారికి తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇవన్నీ గతంలో చాలా రాష్ట్రాల్లో అమలు చేసిన వ్యూహాలే. ఇప్పుడు కొత్తగా బీహార్ లో మరోసారి అదే వ్యూహాంతో ముందుకెళ్లబోతోంది బీజేపీ. అయితే ఏంటి అనే అనుమానం వచ్చింది కదూ. కానీ ఇదే సమయంలో ఏపీలోని అధికార వైసీపీని కూడా బుట్టలో వేసుకుందామని బీజేపీ ట్రై చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి వైసీపీకి బీజేపీ ఇస్తున్న ఆఫర్ ఏంటి? దాన్ని తీసుకోవడానికి జగన్ ఓకే చెబుతారా? అసలు ఈ వ్యూహం వల్ల రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందా?
వైసీపీకి ఎందుకు దగ్గరవ్వాలని అనుకుంటోంది?
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలు కనిపించబోతున్నాయని అంటున్నారు. వైసీపీకి దగ్గరయ్యేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందన్న వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైసీపీని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ వేస్తోందనే టాక్ నడుస్తోంది. ఇలాంటి ప్రచారం గతంలోనూ ఓసారి జరిగింది. ఏవైనా రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కేంద్రంలోని బీజేపీ ఏదో ఒక ఎత్తుగడ వేస్తుంది. ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ముందుకు వెళ్తుంది. నిధులు కుమ్మరిస్తుంది. ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు ఎరవేస్తుంది. అవసరమైతే కేంద్ర కేబినెట్‌లోకి ఆహ్వానిస్తుంది. మంత్రి పదవులు ఇస్తుంది. బీజేపీ గద్దెనెక్కినప్పటి నుంచి శివసేన, జేడీయూ, అన్నాడీఎంకేతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలను ఇలానే చేర్చుకొని ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది.
పదవులు ఇచ్చి జేడీయూతో పొత్తు:
బీజేపీ అదే ఫార్ములాను మళ్లీ తెరపైకి తెస్తోందట. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మిత్రపక్షం జేడీయూని దువ్వే పనిలో పడింది. ఇదివరకు కేంద్ర మంత్రి పదవుల్లో తమకు వాటా సరిగా ఇవ్వలేదని జేడీయూ అధినేత నితీష్ అలిగి కేబినెట్ నుంచి వైదొలిగారు. ఇప్పుడు ఇద్దరికీ అవసరం కావడంతో మరోసారి తప్పనిసరి పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల వేళ జట్టు కడుతున్నారు. ప్రధాని కూడా జేడీయూని కేబినెట్ లోకి తీసుకొని బీహార్‌లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారట. ఇదే సమయంలో జేడీయూతోపాటు వైసీపీకి కూడా చోటు కల్పించాలనే ఆలోచన బీజేపీ పెద్దలకు ఉందన్న ప్రచారం ఢిల్లీలో మొదలైంది.
బీజేపీతో కలిస్తే వైసీపీకి లాభమా? నష్టమా?
పార్లమెంట్‌లో ఎంపీల సంఖ్య పరంగా దేశంలోనే 4వ పెద్ద పార్టీగా వైసీపీ ఉంది. సీఎం జగన్-మోదీ భేటీ జరిగినప్పుడల్లా కేబినెట్‌లో వైసీపీ చేరికపై వార్తలు వస్తుండేవి. కానీ, అవేవీ జరగలేదు. ఒకవేళ బీజేపీ ఆఫర్ ఇచ్చినా జగన్ అంగీకరించకపోవచ్చని అంటున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ మద్దతు అని మొదటి నుంచి జగన్ చెబుతున్నారు. మరి బీజేపీ ఇందుకు సిద్ధంగా లేదు. అలాంటప్పుడు కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ చేరితే ఏపీ ప్రజలు జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టే అవకాశాలున్నాయి. అదే సమయంలో అసలు బీజేపీతో కలిస్తే ఎదురయ్యే పరిణామాలేంటనే అంచనాలు కూడా జగన్ వేసుకుంటారు. దీనివల్ల రాజకీయంగా కొన్ని వర్గాలు తమకు దూరం కావచ్చనే అభిప్రాయం ఉంది.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి కారణం అదేనా:
తాజాగా రాష్ట్రంలో వెయ్యికి పైగా అంబులెన్సులు రోడ్డెక్కాయి. దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ అభినందించడం ఇదే తొలిసారి. ఇదే విషయంలో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అంబులెన్స్‌ల కొనుగోళ్లు, నిధుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. కానీ, పవన్ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశసించారు. పవన్ ప్రస్తుతం బీజేపీతో కలసి పని చేస్తున్నారు. ఇవన్నీ లెక్కలేస్తున్న రాజకీయ వర్గాలు జగన్‌కు బీజేపీ దగ్గరయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి జగన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ఎలాంటి ఎన్నికలు లేని ప్రస్తుత తరుణంలో బీజేపీ అసలు ఏపీపై దృష్టి పెడుతుందో లేదో చూడాలి.