వైసీపీకి షాక్ : బొడ్డేటి ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు రాజీనామా

విశాఖ : వైసీపీలో ఒక్కసారిగా అసంతృప్తులు భగ్గుమన్నాయి. టికెట్ రాని నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా యలమంచిలిలో పార్టీకి షాక్ తగిలింది. బొడ్డేటి ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేశారు. యలమంచిలి అభ్యర్థిగా కన్నబాబు రాజు పేరును ప్రకటించడంతో వైసీపీలో సమన్వయకర్తలుగా ఉన్న బొడ్డేటి ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు అలిగారు. కొద్దిసేపటి క్రితం ఇద్దరు సమావేశం అయ్యారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తమ భవిష్యత్ కార్యాచరణను రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. కన్నబాబు రాజుకు సీటు కేటాయించడంతో నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
జాబితా ప్రకటించినప్పటి నుంచి విశాఖ వైసీపీలో అసంతృప్తి తీవ్రస్థాయిలో బయటపడుతోంది. విశాఖ తూర్పు సీటు తనకు కేటాయించనందుకు మార్చి 17 ఆదివారం ఉదయం వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో వైసీపీలో ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. ఇప్పటివరకు టికెట్ తమకు వస్తుందని ఆశించిన అభ్యర్థులు తమకు కాకుండా వేరే వారికి టికెట్ రావడాన్ని జీర్జించుకోలేని పరిస్థితి ఉంది. ఇదే సమయంలో అనకాపల్లిలో పరిస్థితి కూడా నివురు గప్పిన నిప్పులా ఉంది. ఒకవైపు కొణతాల వర్గం, మరోవైపు దాడి వర్గం.. వీరిద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఎంపీ గానీ, ఎమ్మెల్యే సీటు గానీ కేటాయించలేదు. దీంతో వారి అనుచరులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అధిష్టానం ఈ అసంతృప్తులను చల్లార్చే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది.