మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు : జీవీఎల్ నరసింహారావు

  • Published By: chvmurthy ,Published On : February 5, 2020 / 07:04 AM IST
మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు : జీవీఎల్ నరసింహారావు

Updated On : February 5, 2020 / 7:04 AM IST

ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ప్రకటనను  రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు  ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు.  క్యాపిటల్ నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తాను ముందు నుంచి చెపుతున్నవిషయాన్ని జీవీఎల్ గుర్తు చేశారు. ఏపీలోని ప్రతిపక్షాలు  రాజధాని అంశంలో  ప్రజలను మభ్య పెడుతూ  కేంద్రం పరిధిలోని అంశం అని వక్రీకరించే ప్రయత్నం చేశాయని ఆయన ఆరోపించారు. విపక్షాల వాదనను వమ్ము చేస్తూ కేంద్ర హోం  శాఖ సహాయ మంత్రి  నిత్యానంద రాయ్ పార్లమెంట్ లో నిన్న ప్రకటన చేశారని అన్నారు.  రాజధానిని మార్చుకునే అధికారం రాష్ట ప్రభుత్వానికి ఉంది అని అన్నారు.  

అమరావతిని మార్పు చేస్తూ కొత్త రాజధానులు ఏర్పాటు చేసుకుని … ఆ సమాచారం  కేంద్రానికి పంపిస్తే కేంద్రం కూడా తన దగ్గర ఉన్న సమాచారాన్ని మార్చుకుంటుందని జీవీఎల్ చెప్పారు. గతంలో ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించింది కనుక భవిష్యత్తులో మార్చుకోకూడదని ఎవరూ చెప్పలేదని… కొంత మంది టీడీపీ  నాయకులు తమ ఉనికిని కాపాడుకోటానికి దుష్ప్రచారం చేస్తూ భ్రమ రాజకీయాలు చేస్తోందన్నారు.

ఏపీ బీజేపీ 3 రాజధానులకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంపై మాట్లాడుతూ జీవీఎల్…..  ప్రజల అభీష్టం మేరకే స్ధానిక బీజేపీ కొన్ని వ్యాఖ్యలు చేసింది తప్ప  దాన్ని కేంద్రప్రభుత్వ ప్రకటనగా పరిగణించలేదని జీవీఎల్ వివరించారు.