కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఉంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదు

అమరావతి: గడిచిన 5 ఏళ్లలో ఏపీకీ మోడీ చేసిందేమిలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి నిన్న బీహార్లో రామ్ నగర్ లో ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని బాబు అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించివుంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని, రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రధానికి లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఎన్డీయే హాయంలో 3 రాష్ట్రాలు విభజించామని చెప్పారు. కానీ ఆ 3 రాష్ట్రాలు రాజధాని ఉన్న ప్రాంతాలు కాదని, ఏపీలో రాజధాని ఉన్న ప్రాంతం వేరు పడాలని కోరుకుందని చెప్పారు. అక్కడ వేరు పడిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చారు, కేంద్రం కూడా సహకరించింది, ఆనందంగా వెళ్లిపోయారు. ఆ 3రాష్ట్రాల విభజన వేరు, ఇది రివర్స్ అని చంద్రబాబు వివరించారు.
“ప్రాధమికాంశాలను విస్మరించి మోడి వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. రాజధాని ఉన్న ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా కోరుకున్నారు. తల్లిని చంపారు,బిడ్డను బతికించారు అని కర్ణాటకలో మాట్లాడారు. స్కామాంధ్ర కావాలా, స్కీమాంధ్ర కావాలా అని తిరుపతిలో మోడి అన్నారు. ఏపి విభజనలో బిజెపి కూడా భాగస్వామ్యం ఉంది. ఏపీ గురించి మాట్లాడే హక్కు మోడీకి లేదు. సందర్భం లేకుండా ఏపీ గురించి మోడీ మాట్లాడ్డం వెక్కిరింపు చర్యే ” అని చంద్రబాబు ఆవేశంగా అన్నారు. ఏపీ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి. ఏపీ విషయంలో బీజేపీ శాశ్వత ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన విమర్శించారు.