నేడు అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంటు పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంటు పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
అమరావతి రాజధాని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంటు పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉదయం 11.30 గంటలకు ఆయన బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య పెనుకొండలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం చెన్నేకొత్తపల్లి, మామిళ్లపల్లి, రాప్తాడు మీదుగా బళ్లారి బైపాస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. జనవరి 12న నరసరావుపేటలో పాదయాత్ర చేశారు. నగరంలో పాదయాత్ర ముగిసిన తర్వాత పల్నాడ్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
మరోవైపు అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. తుళ్లూరులో రైతుల మహాధర్నాలో రైతులు, కూలీలు పాల్గొన్నారు. పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను కూడా లెక్క చేయకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. మా భూములిచ్చాం రోడ్డున పడ్డామంటూ నినాదాలు చేస్తున్నారు. తుళ్లూరులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతుల్లో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించడంతో… పోలీసులు అలర్ట్ అయ్యి రైతును అడ్డుకున్నారు.