ఎవరి సొమ్ము : అప్పు చేసి బాబు పప్పుకూడు

అమరావతి: ఏపీ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు, నవరత్నాలకు తోడు కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న పలు సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబుకి సవాల్‌గా మారాయి. ఇప్పటికే అమలు చేయాల్సిన హామీలకు తోడు వైసీపీ, బీజేపీ ఇస్తున్న హామీలను కూడా నెత్తికెత్తుకుని చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు అప్పు చేసైనా కొత్త పథకాలను ప్రకటించాలని తెలుగు తమ్ముళ్లు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు.
చంద్రబాబు అవస్థలు:
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లు ప్రతిపక్ష పార్టీలకు ఆకర్షితులవకుండా ఉండేందుకు చంద్రబాబు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మరోవైపు ఏది చేసినా ఎన్నికల లోపే చేయాలని.. లేకపోతే ప్రజలు తమని నమ్మే పరిస్థితి లేదని తెలుగు తమ్ముళ్లు బాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019, మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో రైతుల కోసం కొత్త పథకాలు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పింఛన్లని రెట్టింపు చేయడంతో కొంత ఊపిరి తీసుకునే పరిస్థితి ఏర్పడిందని.. మిగిలిన విషయాల్లో కూడా తక్షణ కార్యాచరణ లేకపోతే నష్టం జరుగుతుందని అంతర్గత సమావేశాల్లో బాబుకు విన్నవించుకుంటున్నారు.
జగన్ హామీలు, బాబులో గుబులు:
2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీల్లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రపంచ స్థాయి రాజధాని, పోలవరం ప్రాజెక్టు ప్రధానమైనవి. వీటిలో కొన్ని అమలైనా.. మరికొన్ని ఇంకా పూర్తి కాలేదు. ఇక అమరావతి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. ఈ హామీల సంగతి పక్కన పెడితే కొత్తగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇస్తున్న హామీలు అధికార పక్షంలో గుబులు రేపుతున్నాయి. ఈ దశలో కొత్తగా ఏదైనా చేయకపోతే వెనకబడిపోతామనేది టీడీపీ శ్రేణుల ఆందోళన. దాని ఎఫెక్టే పింఛన్ల రెట్టింపు. 2019, ఫిబ్రవరి నుంచి పెరిగిన పింఛను లబ్ధిదారుల చేతిలో పడాలన్నది బాబు ఆలోచన.
కేసీఆర్ బాటలో బాబు:
పింఛను పెంపుదల ఒక్కటే టీడీపీని అధికారంలోకి తీసుకువస్తుందన్న భావన నేతల్లో లేదు. దీంతో మరిన్ని పథకాలకు ఆలోచనలు చేస్తున్నారు చంద్రబాబు. తెలంగాణ తరహాలో రైతు బంధుని పోలిన పథకాన్ని వెంటనే ప్రారంభించాలనేది ఆయన ఆలోచన. ఇందుకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఎంతవరకూ సహకరిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అప్పు తీసుకు వచ్చైనా సరే.. రైతులకు పంట పెట్టుబడి సాయం చేయాల్సిందే అంటున్నారు టీడీపీ నేతలు. ఓవైపు ప్రతిపక్షాల హామీలు.. మరోవైపు సొంత పార్టీ నేతల ఒత్తిడితో.. చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. దీంతో అప్పు చేసైనా కొత్త పథకాలను ప్రారంభించాలని బాబు పట్టుదలతో ఉన్నారు.