చంద్రబాబు వార్నింగ్ : ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా కనుమరుగవుతారు

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 01:45 AM IST
చంద్రబాబు వార్నింగ్ : ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా కనుమరుగవుతారు

Updated On : February 6, 2020 / 1:45 AM IST

3 రాజధానులకే కట్టుబడి ఉన్నామన్న సీఎం జగన్‌ ప్రకటన.. మరోసారి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ ప్రకటనపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎంత వేగంగా అధికారంలోకి వచ్చారో.. అంతే వేగంగా కనుమరుగై పోతారంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి రాదంటూ మరో బాంబు పేల్చారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. దీంతో ఏపీ రాజకీయాల్లో కాక రేగుతోంది. 

సొంతూరులోనే ఉద్యోగాలు:
3 రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్‌. భావి తరాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా వైజాగ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్‌. 

పాలన కోసం కాదు కక్ష తీర్చుకునేందుకు వచ్చారు:
మరోవైపు జగన్‌ ప్రకటనపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో రావణాసురుడి పాలన కొనసాగుతోందని ఘాటు విమర్శలు చేశారు. జగన్‌ ప్రజా పాలన కోసం కాకుండా.. తనపై కక్ష తీర్చుకునేందుకు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎంత వేగంగా వచ్చారో.. అంతే వేగంగా కనుమరుగై పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. ఒకవేళ తమ ప్రధాన రాజధానిగా పలానా నగరం ఉండబోతోందని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తే… దానిని కేంద్రం ఆమోదిస్తుందని చెప్పారు. మొత్తానికి జగన్‌ ప్రకటన అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఏపీ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా హీటెక్కించింది. 

* 3 రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్‌
* జగన్‌ ప్రకటనపై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు
* ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా కనుమరుగై పోతారని ఆగ్రహం 

* రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందన్న జీవీఎల్‌
* రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇస్తే కేంద్రం ఆమోదిస్తుందని స్పష్టం