తమ్ముడు అలా.. అన్న ఇలా : మెగా ఫ్యామిలీలో కేపిటల్ వార్

ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్.. మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి స్వాగతించగా… ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలన్న చిరంజీవి… అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే సమగ్ర రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. అయితే పవన్ మాత్రం అభివృద్ధి అంటే నాలుగు కార్యాలయాలు, నాలుగు భవనాలు కాదన్నారు. అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరుల్ని ఏర్పాటు చేయాలన్నారు.
ఇక.. నిపుణుల కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేలా ఉన్నాయని చిరంజీవి సమర్థిస్తే… జీఎన్ రావు కమిటీ నివేదికతో ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందని పవన్ విమర్శించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని చిరంజీవి చెప్పగా… కమిటీ నివేదికపై మంత్రివర్గ నిర్ణయం వచ్చాకే తమ పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని పవన్ తెలిపారు.
* మూడు రాజధానులపై మెగా ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు
* మూడు రాజధానులకు మద్దతు తెలిపిన చిరంజీవి
* మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలన్న చిరంజీవి
* అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్న చిరంజీవి
* మూడు రాజధానుల ప్రతిపాదనపై పవన్ కల్యాణ్ అభ్యంతరం
* జీఎన్ రావు కమిటి నివేదికతో ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందన్న పవన్
* అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు, నాలుగు భవనాలుగానో భావించడం లేదన్న పవన్
* కమిటీ నివేదికపై మంత్రిమండలి నిర్ణయం కోసం వేచిచూస్తామన్న పవన్
* కేబినెట్ నిర్ణయం తర్వాతే మా నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామన్న పవన్
త్రీ కేపిటల్ ఫార్ములాపై చిరంజీవి అభిప్రాయం:
* రాష్ట్ర సర్వతో ముఖాభివృధికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉంది.
* అమరావతి – శాసన నిర్వాహక , విశాఖపట్నం కార్యనిర్వాహక, కర్నూల్ – న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలి.
* ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్దికై నిపుణుల కమిటి సిఫార్సులు సామాజిక, ఆర్ధిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయి.
* గత అభివృద్ధి , పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది.
* ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్దిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయి.
* ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్ష కోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంది.
* సాగు, తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలస కూలీల బిడ్డల భవిష్యత్ కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుంది.
* ఇదే సమయంలో రాజధాని రైతుల్లో నెలకొన్న భయాందోళనలు ,అభద్రతా భావాన్ని జగన్ ప్రభుత్వం తొలగించాలి.
* వాళ్లు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
* మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్దాలు నివారించే ప్రయత్నం జగన్ ప్రభుత్వం చేయాలి.