మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. మహేశ్వరం టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు

  • Published By: naveen ,Published On : September 30, 2020 / 03:52 PM IST
మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. మహేశ్వరం టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు

Updated On : September 30, 2020 / 4:19 PM IST

Clashes between TRS leaders in Maheshwaram: మహేశ్వరం నియోజకవర్గలో అధికార టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి… సబితా ఇంద్రారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత అభివృద్ధి మంత్రం పేరుతో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఐదేళ్లు గిర్రున తిరిగాయి. ఈసారి టీఆర్ఎస్‌ తరఫున తీగల పోటీ చేస్తే, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. సబితా ఇంద్రారెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. ఆమె కూడా సేమ్‌ టు సేమ్‌ తీగల కృష్ణారెడ్డిలానే నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరుకు బీజం పడిందంటున్నారు పార్టీ కార్యకర్తలు.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి:
తీగల కృష్ణారెడ్డిది ఓవర్గం… మంత్రి సబితా ఇంద్రారెడ్డిది మరోవర్గం. ఈ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. గెలిచిన రెండు నెలలకే గులాబీ కండువా కప్పుకొని మంత్రి అయ్యారు సబిత. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఆమె… తన వెంట వచ్చిన కేడర్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారన్నది తీగల వర్గం ఆరోపణ. అంతే.. తీగల కృష్ణారెడ్డి స్కెచ్ వేశారట. భవిష్యత్ రాజకీయ వ్యూహంతో సొంత కేడర్‌ను కాపాడుకోవడంతో పాటు.. పార్టీలో పట్టు కోసం.. తన కోడలు తీగల అనితను అధిష్టానం ఆశీస్సులతో రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠంపై కూర్చోబెట్టేలా చేశారు.

పైకి కలసి పని చేస్తున్నట్లు కనిపిస్తున్నా ఆధిపత్యం కోసం స్కెచ్చులు:
పైకి ఇద్దరు నేతలూ కలసి పని చేస్తున్నట్లు కనిపిస్తున్నా ఎవరికి వారు నియోజకవర్గంలో ఆధిపత్యం చలాయించాలని స్కెచ్చులు వేసుకుంటున్నారట. సహజంగానే మంత్రి పదవిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి చూట్టూ ఎక్కువ మంది ఉంటున్నారు. కార్యకర్తలు కూడా ఆమె దగ్గరకే ఎక్కువగా వెళ్తున్నారు. ఈ విషయంలో తీగల కృష్ణారెడ్డి కాస్త సీరియస్‌గానే తమ కార్యకర్తలతో సబిత దగ్గరకు వెళ్లొద్దని చెప్పారట. ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు ఎవరికి కార్యక్రమాలకు వెళ్తే ఏమవుతుందో అనే డైలమాలో ఉన్నారట.

ఒకరికి కేసీఆర్, మరొకరికి కేటీఆర్ మద్దతు?
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అధినేత కెసీఆర్ అండదండలు ఉంటే.. తీగల కృష్ణారెడ్డికి పార్టీ యువ నాయకుడు కేటీఆర్ మద్దతు ఉందంటూ మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్‌ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దలు కలుగజేసుకొని సబిత, తీగల మధ్యా సయోధ్య కుదర్చాలని కోరుతున్నారు.