టీడీపీ దూకుడు : కడప, కర్నూలు జిల్లా అభ్యర్థులు వీరే

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు…దూకుడు పెంచారు. పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లపై వరుసబెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇబ్బందుల్లేని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికి పైగా అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. నోటిఫికేషన్ వచ్చే సమయానికి 100 మంది అభ్యర్థులను ప్రకటించేలా రివ్యూలు నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజు ఒకటి, రెండు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, మచిలీపట్నం, విజయవాడ, బాపట్ల, ఒంగోలు, ఏలూరు, నరసాపురం స్థానాలపై ఇప్పటికే సమీక్ష పూర్తి చేశారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో.. 4-5 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇద్దరు, ముగ్గురు నేతలు ఒకే సీటు కోసం పోటీ పడుతుండటం.. స్థానిక విభేదాలు పరిష్కరించాల్సి ఉండటంతో కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టారు. వీటిని కూడా త్వరగానే పరిష్కరిస్తే ప్రచారం ప్రారంభించుకోవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు.
Also Read : లైట్స్ వేయవద్దంటు బీఎస్ఎఫ్ హెచ్చరికలు : చీకట్లో గుజరాత్ గ్రామాలు
కడప ఎంపీగా ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తుండటంతో.. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు ఆయన కోరుకున్న వారికే పోటీ చేసే అవకాశం కల్పించారు. బద్వేలు, కడప, ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. బద్వేలులో సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు ఉంటే.. లాజరస్ సీటు ఆశిస్తున్నారు. కడపలో అష్రఫ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మధ్య పోటీ ఉంది. ప్రొద్దుటూరులో వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, ప్రవీణ్ రెడ్డి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో తంబళ్లపల్లి, మదనపల్లి మినహా.. ఐదు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. తంబళ్లపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అమరావతిలోనే మకాం వేశారు. ఇదే సీటును టీడీపీ సీనియర్ నేత లక్ష్మిదేవమ్మ ఆశిస్తున్నారు. మదనపల్లి సీటు కోసం దొమ్మాలపాటి రమేశ్, బీసీ నేత బోడపాటి మమత, రాందాస్ చౌదరి ట్రై చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, కోడుమూరు, నంద్యాల, పాణ్యం, నందికొట్కూరు స్థానాలను తేల్చలేదు చంద్రబాబు. భూమా నాగిరెడ్డి కుటుంబంలో ఒకరికి సీటిస్తారా లేదంటే ఇద్దరికా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ, నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో నంద్యాల అసెంబ్లీ సీటును ఏవీ సుబ్బారెడ్డి ఆశిస్తున్నారు. గౌరు కుటుంబం టీడీపీలో చేరితే.. పాణ్యంతో పాటు నందికొట్కూరులో వారు కోరుకున్న వారికే ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read : బీహార్ లో 40 సీట్లు గెలుస్తాం : మోడీని ప్రధానిని చేస్తాం
పాణ్యం సీటును ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఆశిస్తున్నారు. కర్నూలు పార్లమెంట్‌లో ఆలూరు అసెంబ్లీ సీటు కోట్ల సుజాతమ్మ పేరు పరిశీలిస్తున్నారు. కోడుమూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీ ఉన్నారు. కోట్ల కోరుకున్న వ్యక్తికే సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఆదోని సీటు మీనాక్షి నాయుడుకు ఇవ్వాలనుకున్నా…ఇదే స్థానాన్ని ఎంపీ బుట్టా రేణుక ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశం ఉంది. కర్నూలు సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, టీజీ భరత్ పోటీ పడుతున్నారు.