దిశ బిల్లుపై అమిత్ షాకు సీఎం జగన్ స్పెషల్ రిక్వెస్ట్

ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం జగన్.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాకు తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. హైకోర్టు తరలింపునకు చొరవ చూపాలని కోరారు. మండలి రద్దు, దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించాలని విన్నవించారు. శుక్రవారం రాత్రి అమిత్‌షాతో సమావేశమైన జగన్… పోలవరం సహా… పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు. ఇవాళ కూడా జగన్ పలువురు కేంద్రమంత్రులతో భేటీకానున్నారు.
పెండింగ్ సమస్యలు షా దృష్టికి తీసుకెళ్లిన జగన్
ఢిల్లీ టూర్‌లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాత్రి కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సుమారు 40 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఏపీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్‌షాకు వివరించారు. ఇందులో భాగంగానే పరిపాలన వికేంద్రీకరణకు మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. హైకోర్టును కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. శాసనసభ మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని… తదుపరి చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని కోరారు. ఇక దిశ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని విన్నవించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వివరణ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై జగన్… షాకు వివరించారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకూ 838 కోట్లను ఆదా చేశామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోందని, 2021 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా 3,320 కోట్లు కేంద్రంనుంచి రావాల్సి ఉందని, ఆ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కేంద్ర జలవనరులశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం 10,610 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. మిగిలిన నిధులను విడుదల చేయాలని అభ్యర్థించారు.
విభజన హామీలు అమలు చేయాలన్న జగన్
ఏపీ విభజన చట్టంలో చెప్పిన విధంగా తమ రాష్ట్రానికి కేంద్రం ఆర్థికసాయం అందించాలని జగన్ అమిత్‌షాను కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికోసం కడప స్టీల్ పాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం – చెన్నై కారిడర్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్‌కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలన్నారు. రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగుపరచడానికి గోదావరి నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలానికి తరలించే ప్రాజెక్టుకూ తగిన ఆర్థిక సహాయం అందించాలన్నారు. పలు అంశాలపై అమిత్‌షాకు జగన్ విజ్ఞాపన పత్రాలు అందజేశారు.
పలువురు కేంద్రమంత్రులతో భేటీ
జగన్ ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులను ఆయన కలువనున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, జలవనరులశాఖ మంత్రి గజేంద్ర షకావత్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యే అవకాశముంది.
Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!