Cm Revanth Reddy : ముఖ్యమంత్రి పదవి నుంచి నన్ను దించేయాలని చూస్తున్నారు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నీకు ఏం అన్యాయం చేసింది? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యేగా చేసినందుకా? ఉమ్మడి రాష్ట్రంలో నిన్ను మంత్రిని చేసినందుకా?

Cm Revanth Reddy : ముఖ్యమంత్రి పదవి నుంచి నన్ను దించేయాలని చూస్తున్నారు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Cm Revanth Reddy : తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని కొందరు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అయ్యి 150 రోజులు కాకముందే.. కొందరు దిగిపో దిగిపో అంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీ నుంచి దించడానికి ఇంకొందరు ఢిల్లీ నుంచి గొడ్డలి తీసుకుని బయలుదేరారని, మరికొందరు శత్రువు పంచన చేరారని సీఎం రేవంత్ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”నా జన్మంతా ఈ ప్రాంతానికి సేవ చేసినా మీ రుణం తీరదు. గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. ఢిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ ను ఓడించలేరు. అమెరికాలో చదువుకునో, వారసత్వ రాజకీయాలతోనో నేను మీ ముందుకు ముఖ్యమంత్రిగా రాలేదు. నేను చదువుకుంది వనపర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో. ఆనాడు చిన్నారెడ్డి గెలుపు కోసం రాతలు రాసినవాన్ని. మీ ఆశీర్వాదంతోనే ఈ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి 150 రోజులు కాకముందే.. కొందరు దిగిపో దిగిపో అంటున్నారు. ఈ పాలమూరు బిడ్డను ముఖ్యమంత్రి నుంచి దించడానికి ఇంకొందరు ఢిల్లీ నుంచి గొడ్డలి తీసుకుని బయలుదేరారు. ఇంకొందరు శత్రువు పంచన చేరి మనల్ని ఓడించాలని చూస్తున్నారు.

డీకే అరుణమ్మ కాంగ్రెస్ ను ఓడించాలని చెబుతుంది. అరుణమ్మా.. కాంగ్రెస్ నీకు ఏం అన్యాయం చేసింది? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యేగా చేసినందుకా? ఉమ్మడి రాష్ట్రంలో నిన్ను మంత్రిని చేసినందుకా? అరుణమ్మకు ఇంత పేరు తెచ్చిపెట్టింది కాంగ్రెస్ కాదా? మోదీ చేతిలో చురకత్తివై నీకు ఇంత చేసిన కాంగ్రెస్ ను కడుపులో పొడవాలని చూస్తున్నావా? ఎంతో గొప్ప అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలని నేను అడగడం తప్పా? ఇది నేరమా?

మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం ఢిల్లీలో మాట్లాడే వారు ఉండాలంటే వంశీ గెలవాలి. ముదిరాజు సోదరులను బీసీ డీ నుంచి ఏ గా మార్చేందుకు.. సుప్రీంకోర్టులో సమస్యలు పరిష్కరించేందుకు వంశీ గెలవాలి. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు.. వంశీచంద్ రెడ్డి ఎంపీగా గెలవాలి.

మోదీ చుట్టంలా వచ్చి పోతారు. ఏనాడైనా అరుణమ్మ వీటిపై మాట్లాడిందా? ప్రాజెక్టులు రిపేర్లు చేయాలన్న ఆలోచన చేసిందా? రేవంత్ రెడ్డి నాపై పగ పట్టారని అరుణమ్మ అంటుంది. ఆమెకు నాకు ఏమైనా గెట్టు పంచాయితీ ఉందా? రేవంత్ రెడ్డిని పడగొట్టేందుకు అమిత్ షాతో పైరవీ చేసి ఢిల్లీలో కేసులు పెట్టించింది. రేవంత్ రెడ్డిని జైలుకు పంపైనా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటోంది. ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలకు సద్దులు మోసి రేవంత్ రెడ్డిని పడగొట్టాలని అరుణమ్మ చూస్తోంది.

ఇక్కడ కల్తీ కల్లు దందాలు, క్రషర్ దందాలు, సారా దందాలు ఎవరివి? ఇన్ని దందాలు చేసే వాళ్లు నన్ను బెదిరించి నాది తప్పు అని అంటున్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీపై కేసీఆర్, హరీశ్ మాట్లాడుతున్నారు. 69 లక్షల మందికి రూ.7500 కోట్లు రైతు భరోసా అందించే బాధ్యత నాది. కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టులోగా 2లక్షల రైతు రుణమాఫీ చేసి పాలమూరు రైతుల రుణం తీర్చుకుంటా. రైతుల రుణం తీర్చుకోకపోతే నా ఈ జన్మ వృథా. హరీశ్ రావు.. రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి సిద్దిపేటకు పట్టిన శని వదిలిస్తా. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది.. మోదీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప.. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. పాలమూరు జిల్లాలో బీజేపీని పాతరేయాలి. వంశీ చంద్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలి” అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

Also Read : రేవంత్ సర్కారుని పడగొడతామన్న వారే పడిపోతారు: అసదుద్దీన్ కీలక కామెంట్స్