CM Revanth Reddy : రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

100 రోజుల మా ప్రభుత్వాన్ని దించుతామంటున్న కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీపై ఎందుకు మాట్లాడరు? ఈటల గెలుస్తారని మల్లారెడ్డి అంటే.. కేటీఆర్ సమర్ధిస్తారా?

CM Revanth Reddy : రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

Cm Revanth Reddy : రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. రాజీనామా సవాళ్లకు తెరతీసింది. సై అంటే సై అంటూ నాయకులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. 7లక్షల కోట్ల అప్పుతో ప్రభుత్వాన్ని మాకు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం.. ఆ అప్పుల్లో 26వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. పెద్దమ్మ తల్లి సాక్షిగా రుణమాఫీ చెల్లించి తీరుతా అని సీఎం రేవంత్ అన్నారు. మేము దోపిడీ చేయం కాబట్టే.. రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు. వాళ్లు దోచుకున్నారు దాచుకున్నారు.. అందుకే కేసీఆర్ రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.

అటు బీజేపీపైనా విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. ప్రజాస్వామ్య మనుగడకు బీజేపీ ప్రమాదంగా మారిందన్నారు. దేశంలో రిజర్వేషన్లు తొలగించాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. దీనిపై ఇప్పటివరకు మోడీ, షా, నడ్డాలు ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉండాలని రాహుల్ గాంధీ యాత్రలో ప్రజలు కోరారని రేవంత్ తెలిపారు. దీనిపై బీసీగణన చేస్తామని హామీ ఇచ్చారు. దేశం ఎక్స్ రే తీసి.. అన్ని కులాలకు సమాన రిజర్వేషన్ ఇస్తామన్నది కాంగ్రెస్ విధానం అని స్పష్టం చేశారు.

‘రిజర్వేషన్లను తొలగించడం.. హిందూ దేశంగా మార్చడం బీజేపీ విధానం. దీని కోసం ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు టార్గెట్ గా పెట్టుకుంది. వచ్చే ఏడాదితో పూర్తి అవుతుంది. అందుకే 400 సీట్లు అంటున్నారు మోడీ. బీసీ, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలపై మోడీ, అమిత్ షా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. నాటి.. ఈస్ట్ ఇండియా కంపెనీగా ఆదానీ కంపెనీ మారింది. హిందువుల ఆస్తులు ముస్లింలకు ఇస్తుందని కాంగ్రెస్ పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దళితులు, మైనార్టీలను కట్టుబానిసలుగా చేయాలన్నది బీజేపీ ఆలోచన. ఆర్ఎస్ఎస్ ప్రణాళికనే రిజర్వేషన్ల తొలగింపు. అదే బీజేపీ చేస్తోంది. మోడీది వికృత రాజకీయ క్రీడ. బీసీగణన చారిత్రక అవసరం. కిషన్ రెడ్డి, ఈటల, బండి సంజయ్ రాజ్యాంగ మార్పుపై మాట్లాడరు.

బీజేపీ కుట్రపై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు? తన బిడ్డ బెయిల్ కోసం మౌనంగా ఉన్నారా? బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటీ.? 100 రోజుల మా ప్రభుత్వాన్ని దించుతామంటున్న కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీపై ఎందుకు మాట్లాడరు? ఈటల గెలుస్తారని మల్లారెడ్డి అంటే.. కేటీఆర్ సమర్ధిస్తారా? బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యారా? ఈటలను.. కేటీఆర్ ఎందుకు ప్రశ్నించరు?

కేసీఆర్ గతంలో భూములు అమ్ముతుంటే.. ఈటల ఒక్కసారైనా ప్రశ్నించారా? బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం మల్లారెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయింది. అందుకే.. మల్లారెడ్డికి కనీసం షోకాజ్ ఇవ్వలేదు. రిజర్వేషన్ ఉండాలి అంటే.. కాంగ్రెస్ కు ఓటేయండి. కాంగ్రెస్.. కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకం.

మోదీలో ఓటమి భయం కనిపిస్తుంది. కేసీఆర్, కేటీఆర్.. చపల చిత్తంతో మాట్లాడుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే రారు. టీవీ షోలో మాత్రం వెళతారు. కేసీఆర్.. రాస్కోరా సాంబ.. అన్నట్లు నాలుగు గంటలు టీవీ స్టూడియోలో కూర్చుంటారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతోంది. కాబట్టి దీనిపై నేను మాట్లాడను. మోడీ, షా లను ప్రసన్నం చేసుకునేందుకు.. కేసీఆర్ కాంగ్రెస్ ను తిడుతున్నారు. సౌత్ ఇండియాలో కాంగ్రెస్ 100కు పైగా సీట్లు గెలుస్తుంది” ” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

”కేసీఆర్ కు ఇంకా గర్వం తగ్గలేదు. కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు పోయిందని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై దర్యాఫ్తు పూర్తయ్యాక మాట్లాడతా. హోంశాఖ నా వద్దే ఉన్నందున బాధ్యతాయుతంగా ఉంటా. రాష్ట్ర ఆదాయం పెంచుకుని రుణమాఫీ చేస్తాం. 2014లో రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్.. 2019 వరకు చేయలేదు. 2019లో రూ.లక్ష మాఫీ చేస్తానని చెప్పి 2023 వరకు చేయలేదు. కేసీఆర్ లా నేను మాట తప్పను, ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తా.

5 నియోజకవర్గాల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోంది. నేను చెప్పింది నిజమని మల్లారెడ్డి మాటలతో స్పష్టమైంది. రుణమాఫీ కోసం భూములు అమ్మవద్దని ఈటల రాజేందర్ అంటున్నారు. మరి కేసీఆర్ భూములు అమ్ముతుంటే ఈటల ఎప్పుడైనా అడిగారా? ఈటలపై భూకబ్జా కేసుల్లో కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు?

భారత్ ను హిందూ దేశంగా మార్చాలన్నది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. హిందూ దేశంగా మార్చేందుకు మోదీ, అమిత్ షా కుట్ర పన్నారు. దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు మోదీ యత్నిస్తున్నారు. 2025కల్లా రాజ్యాంగం మార్చాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. రాజ్యాంగాన్ని మార్చేందుకు మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. అందుకే 400 సీట్లు గెలుస్తామని పదే పదే మోదీ చెబుతున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీలపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు. బీజేపీ ఇన్ని కుట్రలు చేస్తుంటే కేసీఆర్ మాట్లాడటం లేదు. రిజర్వేషన్లు ఎత్తివేయబోమని బీజేపీ ఎందుకు స్పష్టం చేయడం లేదు? రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలి. రిజర్వేషన్లు తీసేయాలంటే బీజేపీకి ఓటు వేయాలి. రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో కేసీఆర్ ప్రకటించాలి. మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. అమిత్ షా ప్రకటనను కేసీఆర్ ఎందుకు ఖండించలేదు?” అని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు సాయం అడిగారు- కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు