వర్కవుట్ అయ్యేనా : తెలంగాణ కాంగ్రెస్.. గుజరాత్ తరహా ప్లాన్

  • Published By: chvmurthy ,Published On : February 9, 2019 / 06:34 AM IST
వర్కవుట్ అయ్యేనా : తెలంగాణ కాంగ్రెస్.. గుజరాత్ తరహా ప్లాన్

Updated On : February 9, 2019 / 6:34 AM IST

కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో  తెలంగాణా లో సామాజిక ఉద్యమకారుల కార్డును ప్రయోగించబోతోందా? గుజరాత్‌ తరహాలో సామాజిక కార్యకర్తలను ఎన్నికల బరిలో దించనుందా ? ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కార్యక్రమాలకు పదును పెడుతున్నారా ?  పార్టీ వర్గాల నుంచి ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

 

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని గుణపాఠంగా తీసుకున్న టీపీసీసీ… పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే విధంగా వ్యూహరచన చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల బరిలో దిగాలని ప్రతిపాదించింది.  పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు… ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తరహాలో రాష్ట్రంలోని రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానాల్లో కొత్త ప్రయోగం చేయాలని ప్రతిపాదించారు. గుజరాత్‌లో సామాజిక ఉద్యమకారులు జిగ్నేశ్‌ మేవానీ, అల్సేష్‌ ఠాకూర్‌, హార్ధిక్‌ పటేల్‌తో బీజేపీకి  ముచ్చెమటలు పట్టించిన కాంగ్రెస్‌.. తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. 
 

ఇప్పటి వరకు రిజర్వ్‌డ్‌ స్థానాలకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు, తటస్థులు, కాంగ్రెస్ సానుభూతిపరులకు టికెట్లు ఇస్తూ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే భిన్నంగా ఉద్యమకారులను బరిలో దించే అంశాన్ని పరిశీలిస్తోంది. దళిత, గిరిజన హక్కుల కోసం పోరాడిన సామాజిక ఉద్యమకారులను గుర్తించి, టికెట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందన్నవిషయంపై టీపీసీసీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. మంద కృష్ణమాదిగకు వరంగల్‌ లోక్‌సభ సీటు ఇవ్వాలని నిర్ణయించింది. మొదటి నుంచి ఎమ్మార్పీఎస్‌ ఉద్యమాన్ని అంటిపెట్టుకుని ఉన్న నాగర్‌ కర్నూల్‌ సీటును సతీశ్‌ మాదిగకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. మాల మహానాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్దంకి దయాకర్‌ను పెద్దపల్లి లోక్‌సభ  స్థానం నుంచి పోటీ చేయించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.  పెద్దపల్లి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో  అదే సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్‌ను రంగంలోకి దింపితే కాంగ్రెస్‌కు లాభం జరుగుతుందని భావిస్తున్నారు. 

ఆదిలాబాద్‌ ఎస్టీ రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానానికి ఆదివాసీ ఉద్యమ నేత సోయం బాబూరావు,  మహబూబాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్  స్థానం నుంచి లంబాడ హక్కుల పోరాట సమితి నేత  బెల్లయ్యనాయక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రతిపాదిస్తున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణాలో  ఎంతవరకు అమల్లోకి వస్తుందో చూడాలి. 

Read Also : జీవితం తలకిందులు : అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి దీనగాథ

Read Also :  నవ్వులపాలు : లోకేష్ సభలో జగన్ బొమ్మలతో కుర్చీలు