Congress Focus On GHMC : గ్రేటర్‌లో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. బల్దియా పీఠాన్ని దక్కించుకునేందుకు మాస్టర్ ప్లాన్

GHMCలో పాగా వేయడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని గ్రేటర్‌పై పట్టు సాధించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.

Congress Focus On GHMC : గ్రేటర్‌లో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. బల్దియా పీఠాన్ని దక్కించుకునేందుకు మాస్టర్ ప్లాన్

Updated On : March 22, 2024 / 10:43 PM IST

Congress Focus On GHMC : గ్రేటర్ ను చేజిక్కించుకునేందుకు గ్రేట్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది కాంగ్రెస్. జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలను గెలవలేకపోయినా పార్లమెంటు పోరులో సత్తా చాటేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఇప్పటికే గులాబీ పార్టీలోని కీలక నేతలకు గాలం వేస్తూ పావులు కదుపుతున్న కాంగ్రెస్ నేతలు.. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ తో టచ్ లోకి వెళ్లారు.

GHMCపై జెండా ఎగురవేసేందుకు స్కెచ్..
ఆపరేషన్ ఆకర్ష్‌ను స్పీడప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ సీట్లు సాధించిన హస్తం పార్టీ.. హైదరాబాద్ లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎలాగైనా ఈ పార్లమెంట్‌ ఫైట్‌లో పట్టు సాధించి GHMCపై జెండా ఎగురవేయాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే GHMC పరిధిలో చేరికలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు హస్తం పార్టీ లీడర్లు.

కాంగ్రెస్ లోకి GHMC మేయర్‌?
GHMC పరిధిలో ఆపరేషన్‌ ఆకర్ష్‌తో రెండు లాభాలను ఎక్స్ పెక్ట్ చేస్తోంది కాంగ్రెస్. గ్రేటర్ పరిధిలోని లోక్‌సభ సీట్లను గెలవడంతో పాటు.. రాబోయే రోజుల్లో బల్దియా పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసయుద్దిన్‌ను చేర్చుకుంది కాంగ్రెస్‌. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా హస్తం గూటికి చేరి.. సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు GHMC మేయర్‌తో సంప్రదింపులు జరుపుతోంది. గద్వాల విజయలక్ష్మీ చేరిక కూడా దాదాపుగా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని టాక్ వినిపిస్తోంది.

మేయర్ సహా మరో 20మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు జంప్..!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల పరంగా బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 39 స్థానాలు గెలిస్తే.. అందులో 16 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనివే ఉన్నాయి. ఇక GHMCలో బీఆర్ఎస్‌కు 56 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎంఐఎంకు 44 కార్పొరేటర్లు ఉంటే అందులో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. బీజేపీకి 48, కాంగ్రెస్‌కు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్‌కు ఉన్న 55మంది కార్పొరేటర్లలో 13మంది ఇప్పటికే హస్తం గూటికి చేరారు. ఇక గులాబీ పార్టీకి మిగిలిన 43 మంది కార్పొరేటర్లలో మేయర్‌తో సహా మరో 20మంది వరకు ఒకటి రెండ్రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

ఎంఐఎం సపోర్టుతో గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని ప్లాన్..
GHMCలో 150మంది కార్పొరేటర్లు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు ఉన్నవారికి మేయర్ పీఠం దక్కుతుంది. 56 కార్పొరేటర్లు ఉన్న బీఆర్ఎస్.. 44 మంది కార్పొరేటర్లు ఉన్న ఎంఐఎంతో కలసి మేయర్ సీటును దక్కించుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ మేయర్ సీటు మీద కన్నేసింది. ముగ్గురు కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్.. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లను చేర్చుకోవడం ద్వారా GHMCలో పాగా వేయాలనుకుంటోంది. ఇప్పటికే బీఆర్ఎస్ 13మంది కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. బీజేపీ నుంచి కూడా కొందరు కార్పొరేటర్లు వెళ్లే అవకాశం ఉంది. ఫైనల్‌గా వచ్చే వారందరినీ చేర్చుకుని అవసరమైతే ఎంఐఎం సపోర్టుతో గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్.

కాంగ్రెస్ ఖతర్నాక్ వ్యూహం..
అయితే ఇప్పటికిప్పుడు గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే మరింత మంది చేరాల్సి ఉంటుంది. ఒకవేళ కార్పొరేటర్లు పెద్దఎత్తున కాంగ్రెస్‌లో చేరినా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి వీళ్లేదు. GHMC మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్ల సమయం పూర్తి కావాల్సి ఉంటుంది. అప్పటివరకు అవిశ్వాసం పెట్టేందుకు మున్సిపల్ యాక్ట్ ఒప్పుకోదు. దాంతో మేయర్ నే తమ పార్టీలో చేర్చుకుంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే మేయర్ గద్వాల విజయలక్ష్మీతో చర్చలు జరుపుతున్నారు కాంగ్రెస్ నేతలు.

గ్రేటర్‌పై పట్టు సాధించుకోవాలని వ్యూహం..
GHMCలో పాగా వేయడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని గ్రేటర్‌పై పట్టు సాధించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ల లోక్‌సభ స్థానంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకే వస్తాయి. అందుకే గ్రేటర్‌ పరిధిలోని కీలక నాయకులపై దృష్టి పెట్టింది హస్తం పార్టీ. లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌లోకి పెద్దఎత్తున చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

Also Read : రేసు గుర్రాలు రెడీ..! కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‎ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?