Medak Lok Sabha Race Gurralu : మెదక్‌ పార్లమెంట్‌ స్థానంలో త్రిముఖపోరు.. ఈసారి గెలుపెవరిది?

గత నాలుగు ఎన్నికల్లో విజయాలు సాధించిన బీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి బలం, బలగంతో తీవ్రంగా పోరాడుతుండగా, రాష్ట్రంలో అధికార బలంతో కాంగ్రెస్‌, కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామనే ప్రచారంతో బీజేపీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి.

Medak Lok Sabha Race Gurralu : మెదక్‌ పార్లమెంట్‌ స్థానంలో త్రిముఖపోరు.. ఈసారి గెలుపెవరిది?

Medak Lok Sabha Race Gurralu

Lok Sabha Elections 2024 : తెలంగాణలోని 16 పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఒక ఎత్తైతే.. ఆ ఒక్క నియోజకవర్గం మరో ఎత్తు. ఒక ప్రధాని, ఒక ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గంలో ఈ సారి ఎలాగైనా గెలవాలని మూడు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌కు కంచుకోటైన ఆ నియోజకవర్గం మధ్యలో ఒకసారి బీజేపీని ఆదరించింది. దీంతో మూడు పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

తెలంగాణ రాజకీయానికి కేంద్రం..
తెలంగాణకు హైదరాబాద్‌ రాజధాని అయితే.. తెలంగాణ రాజకీయానికి మెదక్‌ కేంద్రం. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సొంత జిల్లా కావడంతోపాటు.. మలివిడత ఉద్యమానికి ఊపిరిలూదిన మెదక్‌ జిల్లాలో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఇదే పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి 1980లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. కేసీఆర్‌ కూడా 2014లో మెదక్‌ ఎంపీగా గెలిచి ఆ తర్వాత రాజీనామా చేశారు.

తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్ హవా..
1952లో ఏర్పడిన మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 9 సార్లు కాంగ్రెస్‌ పార్టీయే గెలిచింది. ఇక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత 2004 నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ హవా కొనసాగుతోంది. 1999లో బీజేపీ.. 2004లో అప్పటి టీఆర్‌ఎస్‌ తరపున టైగర్‌ నరేంద్ర ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ విధంగా ప్రస్తుతం పోటీపడుతున్న మూడు పార్టీలు కూడా గతంలో మెదక్‌ పార్లమెంట్‌ స్థానంలో ప్రభావం చూపిన సందర్భాలు ఉండటంతో ఈ సారి అన్ని పార్టీలు మెదక్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా గులాబీ బాస్‌ కేసీఆర్‌, సీనియర్‌ నేత హరీశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో మెదక్‌లో విజయం ఆ ఇద్దరికీ సవాల్‌గా మారింది.

కేసీఆర్ సొంత జిల్లాలో పట్టు సాధించాలనే వ్యూహం..
ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌…. మెదక్‌లో విజయం సాధించి కేసీఆర్‌ సొంత జిల్లాలో పట్టు సాధించాలని ఉబలాటపడుతోంది. మరోవైపు బీజేపీ కూడా మెదక్‌లో పాగా వేసి టార్గెట్‌ 370కి రీచ్‌ కావాలని కలలు కంటోంది. ఇలా మూడు పార్టీలు మెదక్‌పై ఫోకస్‌ చేయడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది.

బీఆర్ఎస్ కు చెక్ చెప్పాలనే వ్యూహం..
హోరాహోరీగా జరుగుతున్న ఈ పార్లమెంట్‌ ఫైట్‌లో కాంగ్రెస్‌ నుంచి ముదిరాజ్‌ నాయకుడు నీలం మధు, బీఆర్‌ఎస్‌ నుంచి రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో ఆరు సీట్లను గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది బీఆర్‌ఎస్‌. ఇక కాంగ్రెస్‌ కేవలం మెదక్‌ అసెంబ్లీ సీటులో మాత్రమే పాగా వేయగలిగింది. బిజేపీ మాత్రం సిట్టింగ్‌ దుబ్బాక స్థానాన్ని కూడా కోల్పోయింది. కానీ, పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఆపరేషన్‌ ఆకర్ష్‌తో బలం పెంచుకుని బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టాలని చూస్తోంది అధికార కాంగ్రెస్‌.

ఓటమి సానుభూతి కలిసొచ్చేనా?
ఇదే సమయంలో బీజేపీ కీలక నేత రఘునందన్‌ రంగంలోకి దిగడం… ఆయనకు ఉద్యమ చరిత్రతోపాటు… పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిగత పరిచయాలు ఉండటం… గతంలో ఎంపీగా, మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన సానుభూతి కలిసి వస్తుండటంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. ముగ్గురు నేతలు.. మూడు పార్టీలు ఎక్కడా రాజీపడకుండా పోరాడుతూ మాటల యుద్ధంతో విరుచుకుపడుతుండటంతో మెదక్‌లో రోజురోజుకూ హీట్‌ పెరిగిపోతోంది.

మహిళా ఓటర్లే ఎక్కువ..
నియోజకవర్గంలో మొత్తం 18 లక్షల 12 వేల 858 ఓట్లు ఉండగా, మహిళా ఓటర్లే ఎక్కువ. మొత్తం ఓటర్లలో 9 లక్షల 16 వేల ఓట్లు మహిళలు కాగా, 8 లక్షల 95 వేల ఓట్లు పురుషులు ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్‌కు బలమైన సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటానుచెరు, సంగారెడ్డి నియోజకవర్గాలు మెదక్‌ పరిధిలో ఉన్నాయి. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్‌లో బీఆర్ఎస్ పార్టీకి 6 లక్షల 68 వేల 797 ఓట్లు వచ్చాయి. ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ 4 లక్షల 18 వేల 211 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ లక్ష 90 వేల 559 ఓట్లు తెచ్చుకోగా, ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న నీలం మధు పటాన్‌చెరులో బీఎస్‌పీ తరఫున పోటీ చేసి 49 వేల ఓట్లు తెచ్చుకున్నారు.

సిద్ధిపేటతో పాటు గజ్వేల్ పై ఫోకస్..
ఇలా మూడు పార్టీల మధ్య భారీ తేడా కనిపిస్తున్నా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో తొలిస్థానం కోసం ముగ్గురూ తీవ్రస్థాయిలో పనిచేస్తున్నారు. గతంలో సిద్దిపేట మెజార్టీనే ఎంపీ అభ్యర్థుల భవితవ్యాన్ని తలకిందులు చేసిన సందర్భాలున్నాయి. 2009లో ఎంపీగా విజయశాంతి 6 వేల ఓట్ల ఆధిక్యంతో గెలువగా… సిద్దిపేటలో ఆమెకు 60 వేల మెజార్టీ వచ్చింది. లేదంటే అప్పుడు రాములమ్మ ఓడిపోయేదే. దీంతో ఈసారి ఎలాగైనా సిద్దిపేటతో పాటు గజ్వేల్‌పై ఫోకస్‌ చేస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్‌.

అందుకే.. నీలం మధుకు కాంగ్రెస్ టికెట్..
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, ఈ సారి మాత్రం సత్తా చాటాలని కసరత్తు చేస్తోంది. మెదక్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌ కీలక నేతలకు చెక్‌ చెప్పాలనే ఉద్దేశంతో నియోజకవర్గం పరిధిలో ఎక్కువ జనాభా ఉన్న ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన నేత నీలం మధుకు టికెట్‌ ఇచ్చింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గెలిపించిన మెదక్‌ ఓటర్లు… మరోమారు కాంగ్రెస్‌కు అవకాశమివ్వాలని కోరుతున్నారు. నేతలంతా సమష్టిగా పనిచేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు.

ఆపరేషన్‌ ఆకర్ష్‌తో పెద్ద ఎత్తున బిజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలను చేర్చుకుంటూ కాంగ్రెస్‌ను బలోపేతం చేసే పనిలో పడ్డారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, సీనియర్‌ నేతలు జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు మెదక్‌లోనే మకాం వేసి నీలం మధు గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. సీనియర్ల సహకారం, కార్యకర్తల ప్రోద్బలంతో మెదక్‌లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు నీలం మధు.

బలమైన అభ్యర్థికి బీఆర్ఎస్ టికెట్..
ఇక సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన స్థానంలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దింపింది బీఆర్ఎస్. తొలుత నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని మెదక్‌ ఎంపీగా పోటీ చేయించాలని భావించింది బీఆర్‌ఎస్‌… ఆ తర్వాత సీనియర్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పేరును పరిశీలించింది. కానీ, పార్టీలో నేతల అభిప్రాయాలను స్వీకరించి చివరికి బలమైన అభ్యర్థిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అయిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి అవకాశం ఇచ్చింది. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు వరుస విజయాలు సాధిస్తున్న బీఆర్‌ఎస్‌… మరోసారి కచ్చితంగా గెలిచి తీరుతామనే ధీమాతో ఉంది. అధికారిగా దశాబ్దాలుగా సేవ చేసే అవకాశం కలిగిందని.. ఇప్పుడు ఎంపీగా గెలిపించి మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను కోరుతున్నారు వెంకట్రామిరెడ్డి.

హరీశ్ భుజాన గెలుపు బాధ్యతలు..
వెంకట్రామిరెడ్డి తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు పూర్తి బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా బిఆర్‌ఎస్‌ కు ప్రతికూల ఫలితాలు వచ్చినా.. మెదక్‌ జిల్లాలో మాత్రం 10కి 7 స్థానాలను గెలిపించడం ద్వారా సత్తా చాటుకున్నారు హరీష్‌ రావు. ఇప్పుడు కూడా మెదక్‌ సీటు గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు హరీశ్‌.

గెలుపుపై రఘునందన్ ధీమా..
మరోవైపు బీజేపీ నుంచి రంగంలో దిగిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు గట్టి సవాల్‌ విసురుతున్నారు. వాగ్దాటిలో తిరుగులేని రఘునందన్‌ పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేలా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ ఇమేజ్‌తోపాటు రామ మందిరం, జాతీయ భద్రత వంటి అంశాలు తనకు కలిసివస్తాయని ఆశలు పెట్టుకుంటున్న రఘునందన్‌కు పార్టీలో కొందరు నేతలు సహకరించకపోవడం ఇబ్బందిగా మారుతోంది. అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తెలంగాణాలో బీజేపీ గెలిచే సీట్లలో కచ్చితంగా మెదక్‌ ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు రఘునందన్‌.

ఓటర్లు ఆదరించేది ఎవరినో?
ఇలా మూడు పార్టీలు తగ్గేదేలే అన్నట్లు పోటీ పడుతుండటంతో మెదక్‌లో ముక్కోణ పోటీ కనిపిస్తోంది. గత నాలుగు ఎన్నికల్లో విజయాలు సాధించిన బీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి బలం, బలగంతో తీవ్రంగా పోరాడుతుండగా, రాష్ట్రంలో అధికార బలంతో కాంగ్రెస్‌, కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామనే ప్రచారంతో బీజేపీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో గాని… మెదక్‌లో పార్లమెంట్‌ పోరు మాత్రం హైటెన్షన్‌గా మారుతోంది.

Also Read : హైటెన్షన్ వైరు లాంటోడిని, ముట్టుకుంటే మాడిపోతావ్- కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్