కేసీఆర్ తిట్లపురాణం.. చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి రావొచ్చని, పోటీ చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి వస్తే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. అంతేకాదు వైసీపీతో పొత్తు పెట్టుకోవచ్చని, ఏపీకి వచ్చి ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.

  • Published By: sreehari ,Published On : December 30, 2018 / 10:02 AM IST
కేసీఆర్ తిట్లపురాణం.. చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి రావొచ్చని, పోటీ చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి వస్తే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. అంతేకాదు వైసీపీతో పొత్తు పెట్టుకోవచ్చని, ఏపీకి వచ్చి ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.

ఉండవల్లి: తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి రావొచ్చని, పోటీ చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి వస్తే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. అంతేకాదు వైసీపీతో పొత్తు పెట్టుకోవచ్చని, ఏపీకి వచ్చి ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు. తన గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వాడిన భాష అసభ్యకరంగా ఉందన్నారు. హుందాతనాన్ని కోల్పోయి మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు అందునా అధికారంలో ఉన్న వారు పద్దతిగా, హుందాగా మాట్లాడాలని చంద్రబాబు హితవు పలికారు. తానెప్పుడూ హుందాతనాన్ని కోల్పోలేదని, ఇష్యూ మీదనే మాట్లాడానని చంద్రబాబు చెప్పారు.

కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీ కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్-మోడీవి లాలూచీ రాజకీయాలు అని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ ఏపీకి నమ్మక ద్రోహం చేశారని అందుకే బీజేపీ నుంచి బయటకు వచ్చేశామన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అందుకే కాంగ్రెస్‌తో చేతులు కలిపామని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ పథకాలను కాపీ కొట్టాము అని కేసీఆర్ చేసిన విమర్శలను చంద్రబాబు తప్పుపట్టారు. ఏపీ అభివృద్ధి కాకూడదని కేసీఆర్, మోదీ, జగన్ కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. దేశాన్ని మోసం చేద్దామని కేసీఆర్, మోడీ కుట్రపన్నారని.. కానీ చేయలేకపోయారని, వారికి ఎవరూ మద్దతివ్వలేదని, ఆ అక్కసుతోనే తనమీద పడ్డారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

కేసుల భయంతో:
ఈఎస్ఐ కేసు నుంచి తప్పించుకునేందకు సీఎం కేసీఆర్ మోడీతో లాలూచీ పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. మోడీ చెప్పినట్టు కేసీఆర్ ఆడుతున్నారని, ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్, కేసీఆర్, మోడీ ముగ్గురూ కలిసి ఏపీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ నన్ను ఎందుకు తిట్టారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజలను చైతన్యపరుస్తూ నేను ముందుకెళ్లాను కానీ పద్ధతి లేని రాజకీయాలు చేయలేదన్నారు. న్యాయం చేయాలని అడిగితే ప్రధాని మోడీ కేసీఆర్ ను నాపై ఎగదోశారని అన్నారు. కేసీఆర్.. మోడీని గాడు, సన్నాసి అన్నాడని మళ్లీ కౌగిలించుకున్నాడని.. అదీ కేసీఆర్ తీరు అని చంద్రబాబు అన్నారు. మోడీ కోసమే కేసీఆర్, జగన్ కలిసి పని చేస్తున్నారని.. ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయాల్లో తాను నిప్పులా బతికానని, ఏనాడూ తప్పు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వైస్రాయ్ ఘటన వెనుక సిద్ధాంతకర్త కేసీఆరే అన్నారు చంద్రబాబు.

అవును నిజమే:
హరికృష్ణ మరణం సమయంలో కేసీఆర్‌తో పొత్తు గురించి తాను మాట్లాడింది నిజమే అని చంద్రబాబు చెప్పారు. మనమిద్దరం కలిసి పని చేద్దామని కేసీఆర్‌తో తాను అన్నానని, అందులో రహస్యం ఏముంది? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ విషయం ఓపెన్‌గానే చెప్పాను, అసెంబ్లీలో కూడా చెప్పాను అని చంద్రబాబు గుర్తు చేశారు. మీకు ఇంట్రస్ట్ ఉంటే ఇద్దరం కలిసి పని చేద్దామని, ఎక్కువ సీట్లు సంపాదిద్దాం అని, జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయం కోసం పనిచేద్దామని, తెలుగు రాష్ట్రాలు బాగుపడుతాయని కేసీఆర్‌తో చెప్పానని..  అందులో తప్పేముందని చంద్రబాబు ప్రశ్నించారు.

రిటర్న్ గిఫ్ట్:
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదన్నారు. వైసీపీకి సపోర్ట్ చేస్తామని, కలిసి పని చేస్తామని ఓపెన్‌గానే చెప్పాలన్నారు. రిటర్న్ గిఫ్ట్ అంటే జగన్‌కు కేసీఆర్ రూ 500 కోట్లు ఇస్తారేమో అని డౌట్ వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కాంట్రాక్టులు జగన్‌కు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ భయపెడితే తాను బెదిరిపోను అని చంద్రబాబు తేల్చి చెప్పారు.