Arvind Kejriwal : నీతి ఆయోగ్ సమావేశం.. ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం, ప్రధానికి లేఖాస్త్రం
Arvind Kejriwal : ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా తుంగలో తొక్కుతున్నప్పుడు, సహకార సమాఖ్యవాదాన్ని అపహాస్యం చేస్తున్నప్పుడు..

Arvind Kejriwal
Arvind Kejriwal – Niti Aayog Meet : ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు(మే 27) నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బహిష్కరించారు. ఆ మేరకు ప్రధానికి లేఖ రాశారు. నీతి ఆయోగ్ లక్ష్యాలు భారతదేశం దార్శనికతను సిద్ధం చేయడం, సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రోత్సహించడం. అయితే అందుకు భిన్నంగా జరుగుతోంది.
కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి, బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చివేయడం, విచ్ఛిన్నం చేయడం, పని చేయడానికి అనుమతించకపోవడం దేశ సహకార సమాఖ్య వాదం కాదని లేఖలో పేర్కొన్నారు కేజ్రీవాల్. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా బీజేపీయేతర ప్రభుత్వాన్ని పడగొట్టడం.. ED, CBI పేరుతో భయపెట్టి ఎమ్మెల్యేల చీలిక ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టడం, ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా విచ్ఛిన్నం కాకపోతే, గవర్నర్ ద్వారా పాలనను అడ్డుకోవడం, ప్రభుత్వం పనిచేయకుండా ఆర్డినెన్స్ అమలు చేయడం జరుగుతోందన్నారు.(Arvind Kejriwal)
” ఎనిమిదేళ్ల పోరాటం తర్వాత ఢిల్లీ ప్రజలు సుప్రీంకోర్టులో పోరాడి గెలిచారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగింది. కేవలం ఎనిమిది రోజుల్లో కేంద్రం ఆర్డినెన్స్‌ను పాస్ చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను తిప్పికొట్టారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఎవరైనా పని చేయకపోతే, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం దాని గురించి ఎటువంటి చర్య తీసుకోదు.
అలాంటి ప్రభుత్వం ఎలా పని చేస్తుంది? ఇది ప్రభుత్వాన్ని పూర్తిగా స్తంభింపజేస్తోంది. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎందుకు స్తంభింపజేయాలనుకుంటున్నారు? ఇదేనా భారత దేశ విజన్? ఇది కో-ఆపరేటివ్ ఫెడరలిజమా? సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండకపోతే ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి వెళతారు? నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం దేనికి? సహకార సమాఖ్యవాదం ఒక జోక్ గా మిగిలిపోతుంది. ఢిల్లీలోనే కాదు యావత్ దేశ ప్రజల్లో మీ ఆర్డినెన్స్‌పై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.(Arvind Kejriwal)
సుప్రీంకోర్టు న్యాయానికి అతిపెద్ద దేవాలయంగా పరిగణించబడుతుంది. సుప్రీంకోర్టును అంగీకరించకపోతే, ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి వెళతారు? రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఇలా బహిరంగంగా తుంగలో తొక్కుతున్నప్పుడు, సహకార సమాఖ్యవాదాన్ని అపహాస్యం చేస్తున్నప్పుడు, నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడంలో అర్థం లేదు. అందుకే రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా.
రేపటి సమావేశానికి హాజరు కావడం సాధ్యం కాదు. దేశ ప్రధానమంత్రి.. కుటుంబానికి తండ్రి, అన్నయ్య లాంటి వారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ప్రధాని అందరినీ వెంట తీసుకెళ్లాలి. దేశంలోని ప్రజలందరూ, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు కలిసి పని చేసినప్పుడే దేశం ముందుకు సాగుతుంది.(Arvind Kejriwal)
కేవలం బీజేపీ ప్రభుత్వాలకు మద్దతిచ్చి, బీజేపీయేతర ప్రభుత్వాల పనిని ఆపితే దేశాభివృద్ధి ఆగిపోతుంది. బీజేపీయేతర ప్రభుత్వాలు పని చేసేందుకు అనుమతించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలి. అప్పుడే సహకార సమాఖ్య విధానం ముందుకు సాగుతుంది. అప్పుడే మన దేశం ముందుకు సాగుతుంది” అని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.