టార్గెట్ 370.. బీజేపీని తక్కువ అంచనా వేస్తే భంగపాటు ఖాయం- జీవీఎల్

మూడోసారి అధికారం ఇస్తే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం. వికసిత్ భారత్ నినాదంతో అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యం. అది బీజేపీతోనే సాధ్యం.

టార్గెట్ 370.. బీజేపీని తక్కువ అంచనా వేస్తే భంగపాటు ఖాయం- జీవీఎల్

GVL Narasimha Rao

GVL Narasimha Rao : అయోధ్య మందిరం తర్వాత బీజేపీ ప్రతిష్ట చాలా చాలా పెరిగిందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీజేపీని ఎవరైనా తక్కువగా అంచనా వేస్తే వారు భవిష్యత్తులో భంగపడతారని హెచ్చరించారు. బీజేపీ జాతీయ సమావేశాల గురించి జీవీఎల్ మాట్లాడారు. గత ఐదేళ్లలో బీజేపీలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం ఇది అని చెప్పారు. ఎన్నికల వేళ కార్యకర్తలు, శ్రేణులకు దిశానిర్దేశం చేసేలా ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ప్రధాని మోదీ ఉపన్యాసంలో 70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను, 50 ఏళ్లలో చేయలేకపోయిన వాటిని చేసి చూపించామన్నారు. అధికారం, స్వార్థం, సుఖం కోసం కాదు.. దేశ నిర్మాణం కోసం అని మోదీ చెప్పారని తెలిపారు. ప్రధాని మోదీ తన ఉద్వేగభరిత ప్రసంగంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారని అన్నారు.

”బీజేపీ సొంతంగా 370 సీట్ల లక్ష్యంతో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రజల ముందుకు వెళ్తున్నాం. రానున్న 100 రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి గత పదేళ్లలో సాధించిన విజయాలు చెప్పాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరికి మోదీ తరపున నమస్కారాలు తెలపాలి. 11వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాం. మూడోసారి అధికారం ఇస్తే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని చెప్పారు. వికసిత్ భారత్ నినాదంతో అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యమని, అది బీజేపీతోనే సాధ్యమని మోదీ అన్నారు.

దక్షిణాదిలో బీజేపీ బలహీనం అనే అపోహ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్ల సంఖ్య కాంగ్రెస్ కంటే ఎక్కువ. ఈ ఎన్నికల్లో కూడా దక్షిణాదిన బీజేపీ సీట్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అన్ని రాష్ట్రాలపైన బీజేపీ ఫోకస్ ఉంటుంది. దేశ నిర్మాణం కోసం అద్భుతమైన మెజారిటీ అవసరం. ఈ సమావేశాల్లో ఏ రాష్ట్ర పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చ జరగలేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు రాజకీయం కాదు, దేశం కోసం అన్నది మా నినాదం. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడం కోసం కార్యకర్తలు పని చేస్తున్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రతి గ్రామానికీ విస్తరించింది” అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

Also Read : దెబ్బకు రెండు పిట్టలు.. జగన్ మాస్టర్ స్ట్రోక్.. సింగిల్‌ లిస్ట్‌తో మూడు నియోజకవర్గాల సమస్యకు చెక్‌..!