సిద్దిపేటలో దుబ్బాక ఉప ఎన్నిక టెన్షన్..!

Dubbaka bye elections : దుబ్బాక ఉప ఎన్నిక వేళ.. సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ – బీజేపీ నేతలు బాహాబాహీకి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఆర్‌ఎస్ నేతలు బస చేసిన హోటల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు.. రచ్చరచ్చ చేసేశారు. అసలు ఇంతకీ సిద్దిపేట స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిందేంటి..? దుబ్బాక బై పోల్ టెన్షన్ పుట్టిస్తోంది.
ఉప ఎన్నిక పోలింగ్ వేళ.. సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్వర్ణ ప్యాలెస్ లాడ్జ్ దగ్గర టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. హోటల్‌లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన బసచేసిన గదిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రతిఘటించారు. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
ఇరువర్గాలు కొట్లాటకు దిగడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. హోటల్ దగ్గర భారీగా మోహరించి.. ఇరువర్గాలను చెదరగొట్టారు. గంటపాటు ఈ హైడ్రామా కొనసాగింది. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
బీజేపీ కార్యకర్తల తీరుపై.. టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు తప్పతాగిచ్చి టీఆర్ఎస్‌పై దాడులు చేయిస్తున్నారని.. బీజేపీకి ఓడిపోతామన్న భయం పట్టుకుందని ఎంపీ మండిపడ్డారు.
ఓర్వలేని బుద్ధితో.. బీజేపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. ఎందుకు వ్యక్తిగతంగా దాడులకు పాల్పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే క్రాంతిపై దాడిని మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.
ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు హరీశ్‌రావు ఫోన్ చేసి.. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో టీఆర్‌ఎస్ ఆదరణ చూసి ఓర్వలేకే బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. భౌతిక దాడులు బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు.
జితేందర్‌రెడ్డి రామాయంపేటలో ఉంటే తప్పులేనిది.. క్రాంతి సిద్దిపేటలో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు హరీశ్‌రావు. టీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడిపై విచారణ చేపట్టామన్నారు సిద్దిపేట ఏసీపీ విశ్వకుమార్. ఎమ్మెల్యే క్రాంతి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ను విచారించామన్నారు.
https://10tv.in/mla-kranti-kiran-responds-to-bjp-activists-attack/
వారు చెప్పిన దాని ప్రకారం ఈ దాడిలో 30 నుంచి 40 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నట్టు తెలుస్తోందన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో కారు – కమలం మధ్య తీవ్రస్తాయిలో మాటల యుద్ధం నడిచింది. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకున్నారు. మరోవైపు డబ్బు కట్టల వ్యవహారం కూడా తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడీ దాడితో ఎలక్షన్ హీట్ మరింత పెరిగింది.