ఏపీకి ఈసీ షాక్ : నిరుద్యోగ భృతి పెంచొద్దు.. ఇవ్వొద్దు

ఏపీ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. సీఎం యువనేస్తం పథకం కింద ఇస్తున్న నిరుద్యోగ భృతి పెంపునకు ఈసీ నో చెప్పింది. నిరుద్యోగ భృతి పెంచడం కుదరదని తేల్చింది. 2014 ఎన్నికల్లో హామీ మేరకు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ప్రభుత్వం భృతి ఇస్తోంది. ప్రస్తుతం నిరుద్యోగ భృతి కింద నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. ఆ మొత్తాన్ని 2వేల రూపాయలకు పెంచుతున్నట్టు ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రకటించారు. మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
Read Also : లోకేష్ పప్పు.. పప్పు : జయంతికి.. వర్ధంతికి తేడా తెల్వదు – షర్మిల
7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, కోడ్ అమల్లో లేని మిగిలిన ఆరు (రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం) జిల్లాల్లో లబ్ధిదారులకు రూ.2వేలు చొప్పున ప్రభుత్వం అందజేసింది. కోడ్ ముగిశాక ఆ 7 జిల్లాలకు పెంపు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఆ ఏడు(ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు) జిల్లాల్లోనూ నిరుద్యోగ భృతి పెంపు అమలుకు ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇది ఇప్పటికే అమల్లో ఉన్న పథకం కాబట్టి అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను ఈసీ తోసిపుచ్చింది. సార్వత్రిక ఎన్నికలు అయ్యే వరకు ఆ 7 జిల్లాల్లో పెంచిన మొత్తం ఇవ్వడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. దీంతో 7జిల్లాల్లో ఎన్నికలయ్యాకే పెంచిన మొత్తం అందే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి యువనేస్తంతో సహా పలు ఉద్యోగ నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లాంటి పథకాలకు సంబంధించి ఈసీ అనుమతి కోసం ప్రభుత్వం ఓ లేఖ రాసింది. దీనిపై ఇటీవల ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరగా, ఆ ప్రతిపాదనలను ఈసీకి నివేదించింది. వీటిని పరిశీలించిన ఈసీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెంపునకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు, రాష్ట్ర సమాచార కమిషనర్ నియామకం, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లాంటి ప్రతిపాదనలకు మాత్రం ఆమోదం తెలిపింది. ఎన్నికల వేళ నిరుద్యోగ భృతిని పెంచడం ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారని విపక్షాలు ఆరోపించాయి. ఇది ఎన్నికల స్టంట్ అని మండిపడ్డాయి.
Read Also : Social Media లో YCP : ట్రెండింగ్‌లో రావాలి జగన్..సాంగ్