Telangana Assembly Elections 2023 : వలస ఓటర్లపై రాజకీయ పార్టీల దృష్టి…ఇతర రాష్ట్రాల నుంచి పోలింగుకు తీసుకువచ్చేందుకు అభ్యర్థుల యత్నాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీన జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. వలస ఓటరు మహాశయులను పోలింగ్ సందర్భంగా వారి వారి స్వగ్రామాలకు తీసుకువచ్చి, తమకు ఓటేశాల చూసేందుకు వివిధ పక్షాల అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు....

Telangana Assembly Elections 2023 : వలస ఓటర్లపై రాజకీయ పార్టీల దృష్టి…ఇతర రాష్ట్రాల నుంచి పోలింగుకు తీసుకువచ్చేందుకు అభ్యర్థుల యత్నాలు

migrant voters

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీన జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు పోలింగ్ రోజు ఓటరును దేవుడిగా చూస్తారు. తమ తలరాత రాసే వలస ఓటరు మహాశయులను పోలింగ్ సందర్భంగా వారి వారి స్వగ్రామాలకు తీసుకువచ్చి, తమకు ఓటేశాల చూసేందుకు వివిధ పక్షాల అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు.

ప్రతీ ఓటు కీలకం

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమని భావిస్తున్న అభ్యర్థులు వలస ఓటర్లను రప్పించేందుకు వీలుగా రాకపోకల చార్జీల కోసం డబ్బుసంచులు పంపించారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితాలు తీసుకొని వారు ఏ రాష్ట్రంలో ఉన్నారు? లేదా హైదరాబాద్ నగరానికి వలస వెళ్లి ఏ ప్రాంతంలో ఉంటున్నారు? అనే వివరాలు తెలుసుకొని వారిని పోలింగ్ తేదీకి రప్పించేందుకు అభ్యర్థులు యత్నిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వలస ఓటర్లను రప్పించేేందుకు యత్నాలు

ముంబయి, పూణే, బీవాండి, షోలాపూర్, బెంగళూరు తదితర నగరాల్లో తెలంగాణ వాసులు కార్మికులుగా, ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. దీంతోపాటు వరంగల్, జనగాం,మహబూబ్ నగర్, సంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల ప్రజలు హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. ఇలా ఉపాధి కోసం వలస వచ్చిన ఓటర్లను పోలింగ్ తేదీ నాడు వారి వారి స్వగ్రామాలకు తీసుకువెళ్లేందుకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

వలస ఓటర్లకు అడ్వాన్సులు

ఇతర రాష్ట్రాల్లో మన తెలంగాణ ఓటర్లను పోలింగ్ తేదీకి తీసుకువచ్చేందుకు వీలుగా ఆయా రాష్ట్రాల్లో మన తెలంగాణ ఓటర్లున్న ప్రాంతాల్లోనే ఆత్మీయ సమావేశాలు పెట్టి పోలింగుకు రావాలని కోరుతున్నారు. రానుపోను రవాణ చార్జీలతోపాటు భోజన ఖర్చుల కోసం వివిధ పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లకు అడ్వాన్సులు కూడా చెల్లిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ఓటర్లు చాలామంది హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు.

బస్సులు, మినీ వ్యాన్లు ఏర్పాటు

పోలింగ్ రోజు హైదరాబాద్ నుంచి వారిని వారి స్వగ్రామాలకు తరలించేందుకు కొందరు అభ్యర్థులు బస్సులు, మినీవ్యాన్లు, కార్లు కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో శివారు ప్రాంతాలైన ఘట్ కేసర్, ఉప్పల్, అంబర్ పేట, ఎల్బీనగర్, బీఎన్ రెడ్డినగర్, రామంతాపూర్, సరూర్ నగర్, పటాన్ చెరువు, చందానగర్, బీరంగూడ, లంగర్ హౌస్, జీడిమెట్ల, సూరారం, మియాపూర్ ప్రాంతాల్లో జిల్లాలకు చెందిన వలస ఓటర్లు నివాసం ఉంటున్నారు.

ALSO READ : Railways Good News : దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త

వలస ఓటర్లను పోలింగ్ రోజు రప్పించేందుకు అభ్యర్థుల తరపున కార్యకర్తలు రంగంలోకి దిగి వారికి రాకపోకలు, భోజన ఖర్చులు చెల్లిస్తున్నారు. పోలింగ్ రోజు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసి బంధుమిత్రులను కలిసి మాట్లాడి వెళ్లండని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరుతున్నారు. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో వలస ఓటర్లను తీసుకువచ్చారు. ఇలా వలసఓటర్ల వల్ల విజయం సాధించిన బీఆర్ఎస్ మునుగోడు ఫార్ములా పేరిట ఈ సారి ఎన్నికల్లోనూ వలస ఓటర్లను ప్రసన్నం చేసుకొని వారిని స్వగ్రామాలకు రప్పించడం ద్వారా వారి ఓట్లు పొందాలని చూస్తున్నారు.