జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఆ నలుగురిదే హవా!

రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పార్టీ బలపడుతుందన్న వార్తల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు ఊపందుకున్నాయి. దీంతో కాస్త బలంగా ఉన్న నేతలంతా పార్టీలో పదవులు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారంట. గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీల వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా చేపట్టాలన్నది పార్టీ విధానం. ఇక తాజాగా సభ్యత్వ నమోదులో కూడా గతంలో ఉన్న దాని కన్నా వందశాతం అధికంగా సభ్యత్వం నమోదైందట. దీంతో పార్టీ నేతలు మాంచి ఊపు మీద ఉన్నారని అంటున్నారు.
హైదరాబాద్ వేదికగా ఒకరి పేరు :
ఇప్పటికే జిల్లా కమిటీలు ఏర్పడి రాష్ట్ర కమిటీకి సిద్ధంగా ఉండాల్సింది. కానీ సంస్థాగత ఎన్నికలు కాస్త ఆలస్యంగా సాగుతున్నాయి. ఇక జిల్లా అధ్యక్షుల ఎంపికలో నలుగురు నేతల హవానే కొనసాగనుంది. ఎవరిని పక్కన పెట్టాలి? ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి? జిల్లాకు ఎవరు అధ్యక్షుడు ఎవరనేది డిసైడ్ చేసేది పార్టీలో మొదటి నుంచి హవా కొనసాగిస్తున్న సంఘటనా కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావులే కీలకం కానున్నారు. పార్టీ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా సమయాభావం వల్ల జిల్లా పర్యటనల అనంతరం జిల్లాల్లో బలంగా ఉన్న నేతల పేర్లను సేకరించి హైదరాబాద్ వేదికగా ఒకరి పేరును ఖరారు చేస్తారట. దీంతో మళ్ళీ ఆ నలుగురు నేతలకే పెత్తనం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వారి కనుసన్నల్లోనే పదవులు :
పార్టీలో కొత్తగా చేరిన నేతలకు వీరు ఎలా పట్టం కడతారంటున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి మొండి చేయి చూపెడతారేమోనన్న అనుమానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా నిరూపించుకుంటామని అంటున్నారు. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో పార్టీలో తీవ్రస్థాయిలో చర్చలు నడుస్తున్నాయి.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారానే జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవాలని పార్టీ విధానాలు స్పష్టం చేస్తున్నా ఆ నలుగురు కనుసన్నల్లోనే పదవులు కట్టబెట్టడంపై అంతర్గతంగా విమర్శలు తలెత్తుతున్నాయి. దీనిపై పార్టీ లో ఉన్న ఆ నలుగురు పెద్దలు తమ విధానాలను సమీక్షించుకుంటారా లేక ఇలాగే ఒంటెద్దు పోకడలకు పోయి పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకు వస్తారా అన్నది చూడాలంటున్నారు.