కొత్త డిమాండ్ : ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖ

ఏపీ రాజధాని గురించి రచ్చ జరుగుతోంది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండని జగన్ ప్రభుత్వం కేపిటల్ గా అనౌన్స్ చేస్తుందని

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 09:33 AM IST
కొత్త డిమాండ్ : ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖ

Updated On : August 29, 2019 / 9:33 AM IST

ఏపీ రాజధాని గురించి రచ్చ జరుగుతోంది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండని జగన్ ప్రభుత్వం కేపిటల్ గా అనౌన్స్ చేస్తుందని

ఏపీ రాజధాని గురించి రచ్చ జరుగుతోంది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండని జగన్ ప్రభుత్వం కేపిటల్ గా అనౌన్స్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఏపీకి 4 రాజధానులు రాబోతున్నాయని బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా రాజధాని గురించి రకరకాల వార్తలు రావడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఇది ఇలా ఉంటే.. తెరపైకి కొత్త డిమాండ్లు వస్తున్నాయి. స్టీల్ సిటీ విశాఖని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని.. ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

అమరావతిపై మంత్రుల గందరగోళ వ్యాఖ్యలతో ప్రజల్లో అయోమయం నెలకొందని గంటా శ్రీనివాసరావు వాపోయారు. దీనిపై సీఎం జగన్‌ మౌనం వీడి స్పష్టత ఇవ్వాలన్నారు. అమరావతిలో భూకుంభకోణం జరిగితే అధికారంలో ఉన్నవారు తేల్చాలన్నారు. రాజధాని కుంభకోణం ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని గంటా స్పష్టం చేశారు. వాస్తవాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు రాజకీయ నాయకులకు ఉంటుందన్నారు. 

రాజధానిపై అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ అంగీకారం తెలిపారని.. ఎక్కడపెట్టినా 30వేల ఎకరాలు ఉండాలని ఆయన సూచించినట్లు గంటా గుర్తు చేశారు. శివరామకృష్ణ కమిటీ నివేదికలోనూ విజయవాడ,  గుంటూరువైపే మొగ్గు చూపారన్నారు. అమరావతి దగ్గర రూ.9వేల కోట్లు మౌలిక సదుపాయాలకే ఖర్చయిందని గంటా చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం 30వేల ఎకరాలకు పైగా ఇచ్చిన రైతుల్లో తీవ్ర ఆందోళన  ఉందన్నారు. రాజధానిపై ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలని గంటా డిమాండ్ చేశారు. అసలే రాజధాని గురించి పెద్ద రచ్చ నడుస్తోంది. జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇది చాలదన్నట్టు టీడీపీ ఎమ్మెల్యే కొత్త డిమాండ్ తో వచ్చారు. విశాఖని ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని గంటా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.