Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం రేవంత్ నయా స్కెచ్ ఏంటి..! ఈ రెండు వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా?
కేసీఆర్ తీసుకొచ్చిన బస్తీ దవాఖానాలు, షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలు వంటి కీలక పథకాలను గుర్తూ చేస్తూ ముస్లిం ఓటర్లను అట్రాక్ట్ చేస్తోంది గులాబీ దళం.
Jubilee Hills Bypoll 2025: ఇప్పటిదాకా ఒక లెక్క. ఇప్పటి నుంచి మరో లెక్క. అవును ఇది జూబ్లీహిల్స్ బైపోల్‌పై పార్టీల స్ట్రాటజీ. కేటీఆర్ వరుస రోడ్‌షోలు, సీఎం రేవంత్ ప్రచార షెడ్యూల్ రిలీజ్‌తో ఉప ఎన్నిక సీన్ ఒక్కసారిగా మారిపోతోంది. ఇక రేవంత్ రెడ్డి ప్రచారంలో దిగేకంటే ముందే కొత్త కొత్త అస్త్రాలను బయటికి తీస్తోంది అధికార పార్టీ. అటు సినీ కార్మికులతో ప్రత్యేక సమావేశం..ఇటు క్యాబినెట్‌లోకి అజారుద్దీన్. ఈ రెండు వ్యూహాలు కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తాయా? కారు సిట్టింగ్ సీటులో కాంగ్రెస్ రింగ్ తిప్పేందుకు దోహదపడుతాయా?
ఒకే ఒక ఉప ఎన్నిక తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్..పట్టు కోసం అధికార కాంగ్రెస్ ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ..ఎవరూ తగ్గడం లేదు. అటు బీజేపీ కూడా సత్తా చాటేందుకు నేషనల్ లీడర్లతో పాటు..ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ లను కూడా ప్రచార రంగంలోకి దించేందుకు రెడీ అవుతోంది. పోలింగ్‌కు తక్కువ సమయమే ఉండటం..ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో..అస్త్రాలన్నీ బయటికి తీస్తున్నాయి పార్టీలు.
బైపోల్ పొలిటికల్ గేమ్‌లో భాగంగా ఆల్ ఆఫ్ సడెన్‌గా సినీ కార్మికుల ఆత్మీయ సమావేశం పెట్టి వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. నెక్స్ట్ డేనే మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ నెల 31న అజారుద్దీన్ రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ బైఎలక్షన్ వేళ ఈ రెండు కీలక డెవలప్ మెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ఆ 25వేల ఓట్ల కోసం స్కెచ్..
రేవంత్ సినీ కార్మికుల సమావేశం వెనుక కూడా బైపోల్ స్ట్రాటజీ ఉందట. సినీ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఎక్కువగా జూబ్లీహిల్స్ ఏరియాలోని బోరబండ, రహమత్‌నగర్, యూసఫ్‌గూడ, కృష్ణానగర్‌లో ఉంటారు. దాదాపు 25వేల మంది సినీ కార్మికుల ఓట్లు జూబ్లీహిల్స్‌లో ఉంటాయని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. ఆ ఓటర్లకు గాలం వేసేందుకు రేవంత్ సినీ కార్మికులతో సన్మానం సభ పెట్టించుకున్నారట.
ఇక అజారుద్దీన్‌కు మంత్రి పదవి వెనుక కూడా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లక్షా 30వేల ముస్లిం ఓటర్లు ఉన్నాయి. ఆ ఓటు బ్యాంకును తమవైపునకు తిప్పుకునేందుకు అటు బీఆర్ఎస్..ఇటు కాంగ్రెస్ చిత్తుబొత్తు ఆట ఆడుతున్నాయి. ఎంఐఎం సపోర్ట్ ఉండటంతో ముస్లిం ఓటర్లు తమవైపే మొగ్గుచూపుతారని హస్తం పార్టీ లెక్కలు వేసుకుంది. అయితే ముస్లిం వర్గంలో పట్టున్న సల్మాన్‌ఖాన్ అనే నేతను బీఆర్ఎస్‌లో చేర్చుకుని కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
అలాగే కేసీఆర్ తీసుకొచ్చిన బస్తీ దవాఖానాలు, షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలు వంటి కీలక పథకాలను గుర్తూ చేస్తూ ముస్లిం ఓటర్లను అట్రాక్ట్ చేస్తోంది గులాబీ దళం. ఇక వివాదాల్లో ఉన్న స్థలాన్ని..రేవంత్ రెడ్డి ముస్లింల స్మశాన వాటిక కోసం ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శిస్తోంది బీఆర్ఎస్. తాము అధికారంలోకి వచ్చాక అందుబాటులో ఉంటే ప్రభుత్వం స్థలం లేకపోతే ప్రైవేటు నుంచి కొని అయినా రెండు ఎకరాల భూమిని ముస్లింల స్మశాన వాటిక కోసం ఇస్తామని.. ఇది తన హామీ..నెరవేర్చి తీరుతానని కేటీఆర్ భరోసా ఇస్తున్నారు.
ఆ స్కెచ్చే.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి అని టాక్..!
ఇదే క్రమంలో రాష్ట్ర క్యాబినెట్‌లో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని.. కేసీఆర్ హయాంలో మహమూద్ అలీని మంత్రిని చేసి పక్కనే కూర్చొబెట్టుకున్నారని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కేటీఆర్. ఈ క్రమంలోనే ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోతుందని.. బీఆర్ఎస్ కూడా ముస్లింలు పెద్దఎత్తున మద్దతు తెలుపుతున్నారని సర్వేల్లో తేలిందట. ఎంఐఎం వ్యతిరేక ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా బీఆర్ఎస్ వైపు మళ్లితే ప్రమాదం తప్పదనే అంచనాతో సరికొత్త ప్లాన్‌కు రేవంత్ తెరలేపారని అంటున్నారు. ఆ స్కెచ్చే అజారుద్దీన్‌కు మంత్రి పదవి అని టాక్ నడుస్తోంది.
అజారుద్దీనే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం పట్టుబట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన తనకే టికెట్ ఇవ్వాలని మొండికేశారు. కానీ కాంగ్రెస్ ముస్లిం నేతకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని..పైగా అజారుద్దీన్‌కు ఇస్తే తాము అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఎంఐఎం తెగేసి చెప్పడంతో..అజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ టికెట్ రేసు నుంచి సైడ్ చేశారు సీఎం రేవంత్. మండలికి పంపుతామంటూ క్యాబినెట్ లో డెసిషన్ తీసుకున్నారు. అప్పుడే అజార్‌కు ఆమాత్యయోగం ఖాయమనే టాక్ వచ్చింది.
అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిన సమయంలో ముస్లిం ఓటు బ్యాంకును తమవైపునకు తిప్పుకునేందుకు అజారుద్దీన్‌ను మంత్రి చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడమే ఆయనకు అదృష్టం కలిసి వచ్చినట్లు అయిందన్న టాక్ వినిపిస్తోంది. అజారుద్దీన్‌కు టికెట్ ఇస్తే గెలుపోటములు ఎలా ఉండేవో తెలియదు కానీ..ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీ కాకముందే మంత్రివర్గంలో చోటు దక్కబోతోంది.
సీఎం రేవంత్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం జూబ్లీహిల్స్ బైఎలక్షన్ మీదకు షిఫ్ట్ చేశారు. మొన్నటివరకు మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లను ముందుపెట్టి నడిపించారు. ఇప్పుడు సడెన్‌గా సినీ కార్మికుల సమావేశం..తర్వాత క్యాబినెట్ లోకి అజార్ అంటూ ప్రకటనలు రావడం బైపోల్ వ్యూహంలో భాగమే అంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటికే పలు సర్వే రిపోర్టుల చక్కర్లు కొడుతున్నాయి. మెజార్టీ సర్వేలు బీఆర్ఎస్‌కే అనుకూలంగా అంచనాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలతో పాటు..ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో కూడా బీఆర్ఎస్ కే కనీసం ఆరు శాతం ఎడ్జ్ ఉందని అంటున్నారు. ఈ గ్యాప్‌ను కవర్ చేసేందుకే ఇలా రేవంత్ సరికొత్త అస్త్రాలను బయటకు తీశారని అంటున్నారు.
