నన్ను ఈవీఎం దొంగ అంటారా : హరిప్రసాద్ ఆవేదన
తనను ఈవీఎం దొంగ అని కేంద్ర ఎన్నికల సంఘం అనడం పట్ల ఏపీ టెక్నికల్ సలహాదారు హరిప్రసాద్(హరి కృష్ణ ప్రసాద్ వేమూరు) స్పందించారు. ఈసీ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఈవీఎం దొంగ అంటారా? అని మండిపడ్డారు. ఈవీఎం దొంగ అని తనను ఘోరంగా అవమానించారని హరిప్రసాద్ వాపోయారు. నేనెంటో, నా టాలెంట్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు అన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అనేది టీవీ ద్వారా ప్రపంచానికి ప్రూవ్ చేసింది నేనే అని హరిప్రసాద్ అన్నారు. ఇందుకు గాను అంతర్జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు, ప్రశంసలు దక్కాయన్నారు. అంతర్జాతీ సంస్థ EFF నన్ను ఘనంగా సత్కరించిందన్నారు. 2010లో అత్యున్నత పురస్కారం ఇచ్చిందని గుర్తు చేశారు. అలాంటి తనను ఈవీఎం దొంగ అని అనడం బాధించిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరోసారి పోరాడాల్సిన సమయం వచ్చిందని హరిప్రసాద్ అన్నారు.
ఈవీఎంల పనితీరుపై ఏపీ సీఎం చంద్రాబు లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు ఈసీ భేటీ ఏర్పాటు చేసింది. దానికి ఏపీ తరుఫున ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ ను చంద్రబాబు పంపారు. హరిప్రసాద్ ను భేటీకి పంపడంపై ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ ఈవీఎం దొంగ అని, హ్యాకర్ అని సంచలన ఆరోపణలు చేసింది. ఈవీఎం చోరీ కేసు నమోదైన అలాంటి వ్యక్తితో తాము చర్చలు జరపము అని ఈసీ స్పష్టం చేసింది. హరిప్రసాద్ స్థానంలో మరొకరిని పంపాలని చంద్రబాబుకి ఈసీ ఘాటు లేఖ రాసింది.
హరిప్రసాద్ గతంలో బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగిగా పని చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని 2010లో ప్రూవ్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది కాబట్టే టీడీపీ ఓడిపోయిందని తెలిపారు. ఆ సమయంలో హరిప్రసాద్ పై కేసు నమోదైంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రూవ్ చేయడానికి ఈవీఎం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎక్కడి నుంచి దొంగిలించి ఇది ప్రూవ్ చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆ పాయింట్ ను బేస్ చేసుకుని ఈసీ హరిప్రసాద్ ను వెనక్కి పంపింది. 2010 మార్చి 13న ముంబైలోని ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో హరిప్రసాద్ పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఆ కేసు విచారణ ఏమైనప్పటికీ, ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకోవడం సముచితం కాదని చెప్పింది.
Felt really insulted when they say I am an accused in EVM case while the whole world know why I showed EVM hack on TV and subsequently been honored by international community ‘EFF’ with their prestigious Pioneer award of 2010. Its time to fight back for Democracy again. ?
— Hari Krishna Prasad Vemuru (@vhkprasad) April 13, 2019