బీఆర్ఎస్‌ను తిడితేనో, ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు- సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్
రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను..

Harish Rao : వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు ప్రవర్తించడం లేదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని ధ్వజమెత్తారు. అబద్దం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని ఫైర్ అయ్యారు హరీశ్ రావు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడకపోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద, నా మీద అవాకులు చెవాకులు పేలారని సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు హరీశ్ రావు.
”అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారు. ఆగస్టు 15వ తేదీలోగా 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఊదరగొట్టారు. అంటే 9 వేల కోట్లు కోత పెట్టారు. అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేశారు. సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజస్వరూపాన్ని ఈరోజు బట్టబయలు చేసుకున్నారు సీఎం రేవంత్.
మేము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17 వేల కోట్లు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? కేవలం 17,869 కోట్లు మాత్రమే అవుతాయా? ఈ ఒక్క విషయంతోనే కాంగ్రెస్ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది. మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్ఎస్ ను తిడితేనో, తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు.
రేవంత్ రెడ్డి.. రైతులతో దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పి మీరు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ, మీకు ఆ సంస్కారం లేదు. మీలో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, మీరు చేసిన పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్నా.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు గాను, దైవ ద్రోహానికి గాను తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా. ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పాడో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో నేనే స్వయంగా పోతా. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ముక్కోటి దేవుళ్లను ప్రార్థించి వస్తాను” అని హరీశ్ రావు అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిస్తాం- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
మీరు రుణమాఫీ 17,934 కోట్లు చేశారు. 46 శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. సీఎంకు సిగ్గు, శరం ఉంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేవుళ్లను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. మీ కంటే ఎక్కువ భాష మాకు వస్తుంది. కానీ సంస్కారం మాకు అడ్డు వస్తుంది. మూసీ ప్రక్షాళన కంటే ముందు నీ నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. 2018 ఎన్నికల్లో హరీశ్ రావు మిమ్మల్ని ఓడించ లేదా? వచ్చే ఎన్నికల్లో రేవంత్ ను ఖచ్చితంగా ఓడిస్తాం. హరీశ్ ను విమర్శించే స్థాయి నీది కాదు.
సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు చెప్పారు- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట సాక్షిగా అబద్ధాలు చెప్పారు. భద్రాచలం రాముడి సాక్షిగా అవాస్తవాలు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంత నీచమైన భాష ఎవరూ వాడలేదు. 30 వేల ఉద్యోగాలు కాదు కదా కనీసం 3 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. సీతారామ ప్రాజెక్టు 8 నెలల్లో పూర్తి చేశామని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బక్రానంగాల్ ప్రాజెక్టు కట్టిందని సీఎం అంటారు. మా ప్రభుత్వం హయాంలో 7,400 కోట్ల నిధులతో పూర్తి చేశాము. కాంగ్రెస్ 75 కోట్లతో చిన్న పనులు పూర్తి చేసింది. 8 నెలల్లో ప్రాజెక్ట్ కట్టడం సాధ్యమైతే కొడంగల్ ప్రాజెక్టు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు? రుణమాఫీ మొత్తం చేశానని సీఎం పచ్చి అబద్ధం చెప్పారు.
ఎన్నో అంక్షలు పెట్టి సగానికి పైగా తగ్గించి 31 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. నేటి వరకు 22 లక్షల 37 వేల మందికి రుణమాఫీ చేశారు. 41 వేల కోట్లు అవుతాయని ప్రకటించి 31 వేల కోట్లు ఇస్తామని 17 వేల కోట్లు రుణమాఫీకి ఇచ్చారు. ఓట్లు లేదంటే తిట్లు.. ఇదీ సీఎం రేవంత్ తీరు. ఆరు గ్యారంటీలు, 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ సవాల్ విసిరారు. మానవ రూపంలో ఉన్న మృగంలా రేవంత్ వ్యవహరిస్తున్నారు. రుణమాఫీ సగం మందికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన రైతులకు చేయాలి. రేవంత్ అబద్ధాలతోనే రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీలు బహిరంగ సభకు ఆహ్వానించినా రాలేదు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది.
సీఎం వ్యాఖ్యలు తలదించుకునేలా ఉన్నాయి- ఎమ్మెల్యే సబితా రెడ్డి
స్వాతంత్ర్య దినోత్సవం రోజున సీఎం చేసిన వ్యాఖ్యలు తలదించుకునేలా ఉన్నాయి. 8 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసే సత్తా ఉంటే… పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? మీరు చెప్పిన లెక్కల ప్రకారం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. 46 లక్షల మందికి ఎప్పుడు చేస్తారు? అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు ఎవరు రాయాలి? మీ మాటలు చూస్తుంటే పక్కా రాష్ట్రాల నేతలు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. సీఎంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలపై ఆత్మ విమర్శ చేసుకోవాలి. హామీలు అమలు చేసే వరకు మా పార్టీ తరపున ప్రశ్నిస్తాము.
Also Read : రాజీనామా చెయ్, సిద్ధిపేటలో ఎలా గెలుస్తావో చూస్తా..! హరీశ్ రావుకి సీఎం రేవంత్ సవాల్