JDS – BJP Alliance: నిన్న బీజేపీని కొట్టడానికి కాంగ్రెస్తో చెలిమి.. నేడు కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీతో దోస్తీ.. పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కుమారస్వామి
కొద్ది రోజుల నుంచే బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై అటు జేడీఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఎట్టకేలకు శుక్రవారం దీనిపై కుమారస్వామి ఓ క్లారిటీ ఇచ్చేశారు.

JDS – BJP Alliance, Karnataka Politics : రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీల పొత్తులు, ఎత్తులు మారుతూ ఉంటాయి. నిన్న తిట్టిన వారితో నేడు చెలిమి, నిన్న దోస్తీ చేసిన వారితో నేడు కుస్తీ పడడం రాజకీయాల్లో సర్వసాధారణం. దేశంలోని చాలా విపక్షాలు భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ఏకమవుతున్న తరుణంలో కర్ణాటకలోని జనతాదళ్ సెక్యూలర్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపింది. విచిత్రం ఏంటంటే.. కొద్ది రోజుల క్రితం బీజేపీని అధికారం నుంచి దూరం పెట్టేందుకు ఇదే పార్టీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది.
Pathapatnam Constituency: వైసీపీ, టీడీపీలోనూ అసమ్మతి కుంపట్లు.. ఎవరు తగ్గుతారో, ఎవరు నెగ్గుతారో!
కర్ణాటక ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోబుతున్నట్లు జేడీఎస్ పార్టీ ముఖ్య నేత కుమారస్వామి శుక్రవారం ప్రకటించారు. పార్టీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తనకు సంపూర్ణ అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. వాస్తవానికి కొద్ది రోజుల నుంచే బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై అటు జేడీఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఎట్టకేలకు శుక్రవారం దీనిపై కుమారస్వామి ఓ క్లారిటీ ఇచ్చేశారు.
“బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కావడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని అసెంబ్లీ లోపలా, బయటా నేను ఇప్పటికే చెప్పాను. ఈరోజు ఉదయం కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో ఎలా ఉండాలనే దానిపై చర్చించారు” అని కుమారస్వామి చెప్పారు. నేతలందరి అభిప్రాయాలను సేకరించి, అన్ని వర్గాల ప్రాతినిథ్యంతో 10 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి పార్టీ సంస్థకు వ్యతిరేకంగా గళం విప్పాలని శాసనసభా పక్ష సమావేశంలో దేవెగౌడ సూచించారట.
మేలో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో మొత్తం 224 మంది స్థానాలకు గాను కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాల్లో గెలుపొందాయి.