నిజామాబాద్ టీఆర్ఎస్‌లో అయోమయం.. ఎమ్మెల్యలంతా తలో దారి!

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గులాబీ పార్టీకి కీలకమైన నిజామాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందంటున్నారు. అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారట. నేతలందరినీ సమన్వయం చేసేందుకు సీనియర్ నేతలు ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్యేలు సమష్టిగా ఉండడం లేదని కిందిస్ధాయి కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఈ కారణంగా పార్టీలో అంతర్గత సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నారు. జిల్లాలో పార్టీకీ పట్టున్నా సమన్వయం చేసే నేత లేకపోవడంతో జిల్లా పార్టీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు.
ఎవరికి వారే బాస్ :
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి స్పీకర్ పదవి దక్కడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీ తరఫున కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ కవిత ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలను సమన్వయం చేసేందుకు అవకాశం కోల్పోయారంటున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి సహా రెండోసారి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన నేతలే ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా ఎవరికి వారే తామే బాస్‌లు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యేలంతా మంత్రికి సమకాలికులు కావడంతో మంత్రిగా ఆయన పూర్తి స్థాయిలో పట్టు సాధించలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది.
పార్టీ పెద్దలకు ఫిర్యాదులు :
మంత్రి అనుసరిస్తున్న వైఖరిపై నిజామాబాద్, ఆర్ముర్, బోధన్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారట. దీంతో జిల్లా సమస్యలపై పార్టీ పెద్దలతోనే చర్చించి తేల్చుకుంటామని జిల్లా ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రి వైఖరిపైనా పార్టీ పెద్దలకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు కూడా అందాయని చెబుతున్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎవరికి వారే వ్యవహరిస్తే జిల్లా స్థాయిలో పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు జనాలు. మరి ఇందుకు విరుగుడుగా అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలని అనుకుంటున్నారు.