నా సొంత అన్న కూడా సీటు వదులుకోవాల్సి వచ్చింది, నన్ను బ్లాక్‌మెయిల్ చేయలేరు- పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నా చుట్టూ కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడతాను. నేను పని చేసే వ్యక్తులను తప్పకుండా గుర్తిస్తా. ప్రాధాన్యత ఇస్తా. నన్ను బ్లాక్ మెయిల్ చేద్దాం అంటే అస్సలు లొంగే వ్యక్తిని కాను.

Pawan Kalyan On Alliance Problems
Pawan Kalyan : జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తుల మధ్యవర్తిత్వం వల్ల తనకు త్యాగాలు తప్పలేదని పవన్ వాపోయారు. బీజేపీ సీట్లు కోరుకోవడం వల్ల నేను కొన్ని సీట్లు వదిలేయాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తుందన్నారు పవన్ కల్యాణ్. పెద్ద మనసుతో వెళితే.. నేనే సీట్లు వదులుకోవాల్సి వచ్చిందని పవన్ ఆవేదన చెందారు. అయినా ప్రజలు, రాష్ట్రం కోసం మనం నిలబ్డడాం అని జన సైనికులతో చెప్పారు పవన్ కల్యాణ్.
”విదుర నీతి ప్రకారం.. ఆంధ్ర రాష్ట్రం క్షేమం కోసం నాతో సహా నేను త్యాగాలు చేయాల్సి వచ్చింది. నా సొంత అన్న నాగబాబు పార్లమెంట్ సీటు కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆయనకు మాట ఇచ్చి కూడా పొత్తులో సీటు వారికి ఇవ్వాల్సి వచ్చింది. అయినా జనసేన గెలుపు కోసం పని చేస్తానని చెప్పి నన్ను అర్దం చేసుకున్న నాగబాబుకు నా కృతజ్ఞతలు. పొత్తులు అనుకున్నాక చాలా సమస్యలు, త్యాగాలు ఉంటాయి. రేపు సీట్లు రాని వారు నన్ను తిట్టినా.. నేను భరించక తప్పదు. కానీ స్థాయిని మరిచినా, పొత్తు ధర్మాన్ని నాశనం చేసినా.. ఊరుకునేది లేదు” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
తనకు సలహాలు ఇచ్చే కాపు పెద్దలపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ”జనసేన లీడర్ షిప్ చాలా త్యాగంతో కూడుకున్నదని చెప్పారు. ఇది 2009 కాదు.. 2024 అని చాలా మంది తెలుసుకోవాలన్నారు. నాడు కాఫీలు, టీలు ఇచ్చి, పెన్ను పేపర్ అందించిన వారు నేడు ఎమ్మెల్యేలుగా వైసీపీలో ఉన్నారని గుర్తు చేశారాయన. ఈ మాటలు అర్దం అవ్వాల్సిన వారికి అన్నీ అర్దం అవుతాయన్నారు. నా చుట్టూ కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడతాను. నేను పని చేసే వ్యక్తులను తప్పకుండా గుర్తిస్తా. ప్రాధాన్యత ఇస్తా. నన్ను బ్లాక్ మెయిల్ చేద్దాం అంటే అస్సలు లొంగే వ్యక్తిని కాను.
మెతకగా మాట్లాడితే.. మొత్తుదాం అనుకుంటే ఇక కుదరదు. నా బిడ్డ జనసేన.. నా గుండెల్లో పెట్టుకుని ఇక్కడి వరకు తెచ్చా. నా జనసేన కార్యకర్తలు, వీర మహిళలను ఇబ్బందులు పెడితే.. నా శత్రువులుగానే చూస్తాను. వైసీపీ గుంపు మొత్తానికి నేను చెబుతున్నా.. జాగ్రత్తగా వినండి. ఈ వైసీపీ ద్వారా నన్ను బద్నాం చేసే వారిని ఎవరినీ వదలం. గుర్తు పెట్టుకోండి” అని హెచ్చరించారు పవన్ కల్యాణ్.
Also Read : నేను పోటీ చేసేది అక్కడి నుంచే..! స్వయంగా పవన్ కల్యాణ్ కీలక ప్రకటన