నాతో చర్చకు సిద్ధమా? చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

చంద్రబాబు పార్టీ సైజు ఎంతో తెలుసుకోవాలి. ఆ పార్టీకి పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్ లు చెయ్యాలి..

నాతో చర్చకు సిద్ధమా? చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

Kodali Nani

Kodali Nani : ఏపీలో సవాళ్ల పర్వం నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం జగన్, చంద్రబాబు.. ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు ఇరు పార్టీల నాయకులు. దమ్ముంటే.. నాతో చర్చకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన సవాల్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. తాజాగా దీనిపై ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు టార్గెట్ గా మరోసారి చెలరేగిపోయారు.

రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా.. పారిపోయిన చంద్రబాబు చేతకాక X(ఎక్స్ లో) లో చాలెంజ్ లా? అంటూ విమర్శించారు. ”సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళుతున్నారు. మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు.. అమలు చేసిన ఓ పథకం, లేదా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో చెప్పాలని జగన్ ప్రశ్నిస్తున్నారు.

Also Read : కూటమితో ఇన్ని కష్టాలా? టీడీపీ నేతలకు తలనొప్పిగా మారిన పొత్తులు..!

అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు.. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ X లో చాలెంజ్ లు చేస్తున్నారు. భారతదేశంలో ఇద్దరు పెద్ద నాయకులు మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా? డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలి. ఎవరు సీఎంగా ఉండాలో జగన్, చంద్రబాబు కాదుగా నిర్ణయించేది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. తనలా మాజీలుగా ఉన్నవారికి చంద్రబాబు X లో ఛాలెంజ్ లు చేసుకోవాలి.

ప్రజలు ఎన్నుకున్న జగన్ తో కాదు. నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తారా? మూడు పార్టీలతో కలిసి వస్తున్నా.. సీఎం జగన్ ఎదుర్కోలేని స్థాయి చంద్రబాబుది. చంద్రబాబు పార్టీ సైజు ఎంతో తెలుసుకోవాలి. ఆ పార్టీకి పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్ లు చెయ్యాలి” అని కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని.