సైకిల్‌ సవారీ చేస్తుందా.. ఫ్యాన్‌ గాలి వీస్తుందా : కోడుమూరులో గెలుపెవరిది

కోడుమూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, విపక్షాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 02:21 PM IST
సైకిల్‌ సవారీ చేస్తుందా.. ఫ్యాన్‌ గాలి వీస్తుందా : కోడుమూరులో గెలుపెవరిది

Updated On : February 15, 2019 / 2:21 PM IST

కోడుమూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, విపక్షాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

కర్నూలు : ఉమ్మడి రాష్ట్రానికి తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య ప్రాతినిధ్యం వహించిన కోడుమూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, విపక్షాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఇక్కడ పట్టు కోసం టీడీపీ, వైసీపీలు పావులు కుదుపుతున్నాయి? కోట్ల కాంగ్రెస్‌ను వీడడం.. ఆయన సోదరుడు హర్షవర్ధన్‌రెడ్డి వైసీపీలో చేరిన నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారాయి..? కోట్ల పట్టు నిలుపుకుంటారా..? ఇక్కడ సైకిల్‌ సవారీ చేస్తుందా..? ఫ్యాన్‌ గాలి వీస్తుందా..?

 

కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. 1962లో ఏర్పాటైన కోడుమూరు నియోజకవర్గంలో ఇప్పటికి కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) ఎనిమిదిసార్లు, టీడీపీ, వైసీపీ చెరొకసారి, ఇండిపెండెంట్‌ ఒకసారి గెలుపొందారు. దివంగత దామోదరం సంజీవయ్య ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందే ఉమ్మడి రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ తరుపున శిఖామణి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కూమారుడు మణిగాంధీ 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.

 

2009లో పునర్విభజన వల్ల కోడుమూరు, గూడూరు, బెళగల్ మండలాలు, కర్నూలు మండలంలో ఉన్న 12 గ్రామాలు, కర్నూలు నియోజకవర్గంలోని 19 గ్రామాలు, నందికొట్కూరు నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని కలిపి కోడుమూరు నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. కోట్ల కుటుంబం స్వస్థలం లద్దగిరి కూడా కోడుమూరు మండలంలోనే ఉంది. ఈ నియోజకవర్గంలో కోట్ల కుటుంబానికి మంచి ప్రాబల్యం ఉండడంతో, వారు నిలబెట్టిన అభ్యర్థులకే ప్రజలు పట్టం కడుతూ వచ్చారు. అయితే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ మూల కారణం కావడంతో నియోజకవర్గ ప్రజలు 2014 ఎన్నికల్లో కోట్ల కుటుంబానికి హ్యాండిచ్చి వైసీపీని గెలిపించారు.

 

ఎన్నో ఏళ్లుగా కోట్ల నిలబెట్టిన అభ్యర్థులను గెలుపిస్తూ వచ్చిన ప్రజలు.. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మణిగాంధీని బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఐతే.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మణిగాంధీ టీడీపీలో చేరారు. దీంతో ఆయనపై నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. అంతేగాక అధికార పార్టీలో చేరినా మణిగాంధీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ నేతలే మణిగాంధీపై అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గ టీడీపి ఇంఛార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డికి, మణిగాంధీకి మధ్య విభేదాలతో.. టీడీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. తమ్ముళ్లు రెండు గ్రూపులుగా ఏర్పడి నువ్వా, నేనా అనే రీతిలో విమర్శలకు దిగుతున్నారు. ఇదే అదునుగా వైసీపీ ఇంఛార్జ్ మురళీకృష్ణ నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటిస్తున్నారు.

 

మరోవైపు సొంత నియోజకవర్గంలో కోట్లకు ఆయన సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న కోట్ల హర్షవర్ధన్ రెడ్డి.. అన్న టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో మనస్తాపానికి గురై వైసీపీలో చేరారు. ఈ నెల 7న జగన్ సమక్షంలో దాదాపు 2 వేల మందితో వైసీపీలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కోడుమూరును కైవసం చేసుకునేందుకు పార్టీలకు బదులుగా కోట్ల కుటుంబాలు బలమైన అభ్యర్థులను దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.