వైసీపీలో బొత్సకు ప్రాధాన్యం తగ్గుతోందా? జగన్ తెలిసే చేస్తున్నారా?

ఉత్తరాంధ్రలో మకుటం లేని మహారాజుగా పేరొందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మున్సిపల్ శాఖ బాధ్యతలు సైతం ఆయనే నిర్వర్తిస్తున్నారు. తాను పదవులు సంపాదించుకోవడమే కాదు… తనను నమ్ముకున్న వారికి సైతం పదవులు వరించేలా చేయడం బొత్సకే సాధ్యం. కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు దశాబ్దకాలం పాటు మంత్రి పదవుల్లో ఉంటూ… తిరుగులేని నేతగా ఎదిగారు. జిల్లాలో సైతం దాదాపు అన్ని పదవులను తన అనుచరులకే వరించేలా చక్రం తిప్పి, తన మార్క్ రాజకీయాలతో కీలక నేతగా ఎదిగారు.
బొత్సను కాదని జూనియర్ కు డిప్యూటీ సీఎం పదవి:
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో తాను చెప్పిందే వేదం అన్నట్టుగా సాగింది. ఆ తర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి రావడంతో మెల్లమెల్లగా బొత్స ప్రాభవం తగ్గుతూ వచ్చింది. వైసీపీలోకి అడుగుపెట్టిన తర్వాత బొత్స దూకుడు తగ్గిందనే చెప్పుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొత్స ఎక్కువ కాలం హైదరాబాద్‌లోనే గడిపారు. జిల్లా రాజకీయాలను తన మేనల్లుడు చిన్న శ్రీనుకు అప్పగించేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం, పవర్‌లోకి రావడంతో బొత్స సత్యనారాయణకు కూడా మంత్రి పదవి దక్కింది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా… జిల్లాకు ఒక డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడం అప్పట్లో మంత్రి బొత్స వర్గానికి పెద్ద షాకే తగిలింది. సీనియర్ నేత, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న బొత్సను కాదని, తన కన్నా ఎంతో జూనియర్ అయిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడం బొత్స వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.