నగరిలో ఇంటిపోరు: ముద్దు కృష్ణమ కొడుకుల మధ్య వార్

గాలి ముద్దుకృష్ణమ నాయుడు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. కళాశాలలో అధ్యాపకునిగా పని చేస్తున్న ఆయన నాడు ఎన్టీఆర్ పిలుపందుకుని టీడీపీలో చేరారు. ఇది వరకు ఉన్న పుత్తూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే 2018లో ఆయన మరణించారు. ఆ తర్వాత నుంచి కుటుంబంలో రాజకీయ వారసత్వ కోసం ఇంటిపోరు మొదలైంది. జిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముద్దు కృష్ణమ ఇద్దరి కొడుకుల మధ్య వార్‌కు తెర తీసింది.
తండ్రి వారసత్వం కోసం పోటీ :
పెద్ద కుమారుడు భాను ప్రకాశ్, చిన్న కుమారుడు జగదీశ్.. తండ్రి వారసత్వం కోసం పోటీ పడ్డారు. ఈ వారసత్వ పోరు టీడీపీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. దీంతో టీడీపీ హైకమాండ్ గాలి ముద్దుకృష్ణమ భార్య సరస్వతమ్మను అనూహ్యంగా రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది. ఆయన మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని సరస్వతమ్మతో భర్తీ చేయడంతో తాత్కాలికంగా వారసత్వ పోరుకు బ్రేక్ పడింది. కానీ, 2019 ఎన్నికల్లో నగరి టీడీపీ టికెట్‌ను దక్కించుకునేందుకు ఇద్దరు కుమారులు మళ్లీ పోట్లాటకు దిగారు.
ఓడినా చల్లారని తగాదాలు :
భాను ప్రకాశ్ ఒక వర్గంగా, జగదీశ్, సరస్వతమ్మలు మరో వర్గంగా నగరి టీడీపీ కేడర్‌ను పంచేసుకున్నారు. టీడీపీ హైకమాండ్ మాత్రం భానుప్రకాశ్ వైపే మొగ్గు చూపింది. పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. హైకమాండ్ నిర్ణయంతో సరస్వతమ్మ, జగదీశ్ అసంతృప్తితో రగిలిపోయారు. ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. రోజా చేతిలో భానుప్రకాశ్ ఓటమి పాలైనా… కుటుంబంలో తగాదాలు మాత్రం ఇప్పటికీ చల్లారలేదంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో తల్లి, సోదరుడు తన ఓటమికి కారణమన్నది భాను అనుమానం. అందుకనే వారితో తన ఘర్షణ వైఖరి ఇంకా కొనసాగిస్తున్నారట. మరోవైపు సరస్వతమ్మ, జగదీశ్ రాజకీయంగా కనుమరుగైపోయారు.
పెద్దొడికి టికెట్ ఇచ్చారని :
తన అభిమతానికి భిన్నంగా చంద్రబాబు.. పెద్దోడికి టిక్కెట్ ఇవ్వడం పట్ల సరస్వతమ్మ బాగా నొచ్చుకున్నారట. ఎమ్మెల్సీగా ఉన్నా కూడా పార్టీకి మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పార్టీ సమీక్షకు వచ్చిన చంద్రబాబును కలుసుకొనేందుకు సరస్వతమ్మ రాకపోవడం వెనుక కారణమిదేనని అంటున్నారు. ఆమెకు బాబు మీద కోపం తగ్గలేదని జిల్లాలో టాక్ నడుస్తోంది. అన్న భానుపై ఇంకా ఆగ్రహంగానే ఉన్నాడట తమ్ముడు జగదీశ్. తనను ఓడించారని తల్లి, తమ్ముడిపై పగతో రగిలిపోతున్నారట భాను. ఇదంతా చూస్తున్న జనాలు మాత్రం పొలిటికల్ ఫ్యామిలీ రివెంజ్ డ్రామా సినిమాలా ఉందని అనుకుంటున్నారు.
మరోవైపు ఈ కుటుంబ వ్యవహారం వల్లే నగరిలో పార్టీ రోడ్డున పడిందని బాబు ఆగ్రహంగా ఉన్నారట. నగరి ఇన్‌చార్జిగా ఉన్న భానుప్రకాశ్‌ను కొనసాగించాలా? మరొకరిని నియమించాలా అనేది అధినేత తేల్చుకోలేక పోతున్నారని చెబుతున్నారు. నగరిలో రోజా మరింత దూకుడుగా ముందుకెళుతుండగా, తమ పార్టీలో ఈ లుకలుకలు బాబుకు చిరాకు తెప్పిస్తున్నాయని అంటున్నారు. నగరి పంచాయితీని ఎలా తేల్చుకోవాలో తెలియక ఇటు చంద్రబాబు, అటు జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారట.