పవర్ ప్రాబ్లమ్ : ప‌వ‌న్‌లో కాన్ఫిడెన్స్ లెవల్స్‌ తగ్గాయా

  • Published By: madhu ,Published On : May 16, 2019 / 01:26 AM IST
పవర్ ప్రాబ్లమ్ : ప‌వ‌న్‌లో కాన్ఫిడెన్స్ లెవల్స్‌ తగ్గాయా

Updated On : May 16, 2019 / 1:26 AM IST

ఏపీ ఎన్నికల్లో జనసేన గెలుపుపై ప‌వ‌న్‌ కల్యాణ్‌కు అనుమానాలున్నాయా ? జనసేనానిలో ఉత్సాహం తగ్గడానికి కారణమేంటి ? ఎన్నికల ప్రచారంలో అధికారం మాదేనంటూ ఊగిపోయిన పవన్‌… ఇప్పుడెందుకు స్వరం మారుస్తున్నారు? పోలింగ్‌ తర్వాత పవన్‌కు ఏ విషయంలో క్లారిటీ వచ్చింది? ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన ప్రధాన పార్టీలన్నీ… తమ గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ నేతలతో సమీక్షలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

గెలుపు ఓటుములతో మనకు పనిలేదు. నిజాయతీతో రాజ‌కీయాలు చెయ్యడమే మన బాధ్యతని… పార్టీ నేతలతో పవన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఎలాంటి ఫ‌లితాలు వ‌చ్చినా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ జనసేన ముందుకు వెళ్తుందన్నారు. మరికొద్ది రోజుల్లో ఫ‌లితాలు వస్తాయనగా… ప‌వ‌న్ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం… జనసేన నేతల్ని కలవరానికి గురి చేసింది.

పోలింగ్‌ ముందు వ‌ర‌కూ జ‌న‌సేనదే అధికారమంటూ పవన్‌కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్ర‌చారంలోనూ ఇదే దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ స్వ‌రం మారిన‌ట్లే క‌నిపిస్తుంది. ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్‌లో క‌నిపించిన పాజిటివ్ వేవ్స్… ప్రస్తుతం క‌నిపించ‌డ‌ం లేదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. రాష్ట్రంలో పోలింగ్‌ ముగిశాక విశ్రాంతి తీసుకున్న ప‌వ‌న్…ఇటీవ‌లే పార్టీ అభ్యర్ధుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో… పవన్ స్వరం మారినట్లే కనిపిస్తోంది. అధికారం తమదే అనే మాట ప‌వ‌న్ నోటి నుంచి రాలేదు.

కింగ్‌ అవ్వకపోయినా.. కింగ్‌ మేకర్‌ మనమే అవుతామని కూడా చెప్పలేకపోయారు. కేవ‌లం పార్టీ అభ్య‌ర్ధుల నుండి అభిప్రాయాలు తీసుకుని స‌మీక్ష‌ను ముగించేశారు.
ప‌వ‌న్‌ కల్యాణ్‌ ఆశించినంత‌గా..ఎన్నికల్లో జనసేన బ‌లం చూపిస్తుందా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. పైకి జ‌న‌సేన నేత‌లు త‌మ‌కు వ‌చ్చే సీట్లపై లెక్క‌లు వేసుకుంటున్నా… లోలోప‌ల మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు. దీనికితోడు స‌మీక్ష స‌మావేశాల్లో ప‌వ‌న్ చేసిన కామెంట్స్… ఆ పార్టీ నేత‌ల్ని, క్యాడ‌ర్‌ను మ‌రింత గంద‌ర‌గోళంలో ప‌డేశాయి.

జ‌న‌సేన అసెంబ్లీలోకి వెళ్తుందని ప‌వ‌న్ చెప్పినా… ఆయ‌న మాట‌ల్లో మునుపటి కాన్ఫిడెన్స్ క‌నిపించ‌డం లేదని చెప్పుకుంటున్నారు. తాము అనుకున్నంత స్థాయిలో పార్టీకి ఓటింగ్ జ‌రిగినా.. సీట్లు గెలిచే విష‌యంలోనే అనుమానాలు ఉన్న‌ట్లు పార్టీలో కీల‌క నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ప‌వ‌న్‌లో కాన్ఫిడెన్స్ లెవల్స్‌ తగ్గిపోవడంతో… జనసేన కేడర్‌లో నిరుత్సాహంలో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమాత్రం ఉంటుందో… ఈ నెల 23న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది.