రాయలసీమ గడ్డపై పవన్ టూర్

కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీలో ఫుల్ జోష్ నింపేందుకు ఆ పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన పవన్ అనంతరం కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యారు. ఎన్నికల గడువు దగ్గరకొస్తుండడంతో ఏపీలోని ప్రధాన పార్టీలు సీట్ల సర్దుబాటు, పార్టీ అభ్యర్థుల ఖరారుపై తలమునకలయ్యాయి. మరోసారి జిల్లాల బాట పట్టాలని పవన్ నిర్ణయించి అందుకు తగిన షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
రాయలసీమలో పవన్ :
ఉత్తరాది, గోదావరి తదితర జిల్లాల్లో పవన్ పర్యటించారు. తాజాగా రాయలసీమపై పవన్ కన్ను వేశారు. ఇక్కడ పర్యటించి నేతలతో భేటీ అయి..ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అంతేగాకుండా రోడ్ షో, బహిరంగసభలు ఏర్పాటు చేసి ప్రసంగించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. వివిధ వర్గాల వారిని కలిసి వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
పవన్ షెడ్యూల్ :
ఫిబ్రవరి 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు కర్నూలులో పవన్ పర్యటించనున్నారు. ఆదివారం రోడ్ షో నిర్వహించనున్నారు. కర్నూలు పట్టణంలోని సీ క్యాంపు నుండి కొండారెడ్డి బురుజు వరకు రోడ్ షో సాగనుంది. మహిళల సమస్యలు, స్వయం ఉఫాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చిస్తారు. ముస్లిం, మైనార్టీలకు సంబంధించిన చర్చా కార్యక్రమంలో సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ముస్లిం యువతకు నైపుణ్యాల అభివృద్ధి స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపై చర్చ ఉంటుంది. ఫిబ్రవరి 25వ తేదీన అదోనీలో పవన్ పర్యటన జరుగనుంది. పత్తి రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు. ఫిబ్రవరి 26న ఆళ్లగడ్డలో పవన్ పర్యటన జరుగనుంది.