Pawan Kalyan : అలాంటి వారి కోసమే నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తొడగొట్టడాలు నాకు తెలీదు. మీరు కొడితేనే రక్తం వస్తుందా..? మేం కొడితే రక్తం రాదా..? మేం కొడితే కాళ్లు.. కీళ్లు విరగవా..?

Pawan Kalyan
Pawan Kalyan : ఇది 2009 కాదు.. 2024.. అనే విషయాన్ని సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రౌడీయిజానికి నేను భయపడను అని పవన్ చెప్పారు. మనల్ని తన్ని తగలేస్తే.. మనం కూడా తన్ని తగలేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పవన్. వేరే కులాలకు మంత్రి పదవి ఇస్తారు కానీ.. ప్రాక్సీ ఎమ్మెల్యేలుగా వాళ్ల గుంపే ఉంటుందన్నారు పవన్.
”సుగాలి ప్రీతి, కొట్టే సాయి వంటి వారి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నా. పుష్ప సినిమా చూడడానికి బాగుంటుంది. కానీ, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వాళ్లని నిజజీవితంలో భుజానికి ఎత్తుకోగలమా..? తిరుమలలో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. గతంలో పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులు వంటి వారు చెబితే నేనూ మాట్లాడాను. కానీ అలాంటి రమణ దీక్షితులు కూడా టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై మాట్లాడ్డం లేదు.
రాయలసీమతో నాకిదే సమస్య. తొడగొట్టడాలు నాకు తెలీదు. మీరు కొడితేనే రక్తం వస్తుందా..? మేం కొడితే రక్తం రాదా..? మేం కొడితే కాళ్లు.. కీళ్లు విరగవా..? ఆరణి శ్రీనివాస్ నాకు 2008 నుంచి పరిచయం. కొద్దిపాటి ఓట్ల తేడాతో 2009లో ఆరణి ఓడించబడ్డారు. ఏమీ ఆశించకుండా పార్టీలో పని చేయడానికి ఆరణి సిద్దపడ్డారు. చిత్తూరు జిల్లా ఓ ఐదుగురు చేతుల్లోనే ఉంది. పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి మీద నాకేం శతృత్వం లేదు. రాయలసీమ కొద్ది మంది చేతుల్లోనే బందీ అయిందనే బాధ నాకుంది. రాయలసీమలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్టుగా పరిస్థితి ఉంది.
2019లో నేను ఓడిన సమయంలో ప్రీతి తల్లి వచ్చి నన్ను కలిసింది. తన లాంటి వారి కోసం నన్ను నిలబడాలని కోరింది. నన్ను కర్నూలు రావాలని ఆహ్వానించింది. నేను కర్నూలు వెళితే లక్షన్నర మంది జనం వచ్చి సుగాలి ప్రీతి తల్లికి మద్దతు తెలిపారు. జనసేన ఒత్తిడి కారణంగానే సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇచ్చారు. రాయలసీమలో నిరసన తెలపాలని వస్తే మద్దతిస్తున్నారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం భయపడుతున్నారు. ఈ నేల పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి ది కాదు. రాయల వారు ఏలిన నేల రాయలసీమ. ఊర కుక్కలను కుందేలు తరిమిన నేల రాయలసీమ. అలాంటి ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో ఉండిపోయింది” అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : టీడీపీలో కొత్త తరహా రాజకీయం.. ఎలాంటి నష్టం జరుగుతుందో అనే ఆందోళనలో అధిష్టానం