MP Sanjeev Kumar: ఇది చూసి ఓర్వలేకే నారా లోకేశ్ అసత్య ప్రచారం: ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఫైర్
MP Sanjeev Kumar: నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మండిపడ్డారు. లోకేశ్ కి కౌంటర్ ఇచ్చారు.

MP Sanjeev Kumar
MP Sanjeev Kumar: టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల వైపు ఉందని చెప్పారు. ఇది చూసి ఓర్వలేక నారా లోకేశ్ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు రాజకీయ పదవులు 10 నుంచి 12 శాతం మాత్రమే కల్పించారని చెప్పారు.
కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 60 శాతం రిజర్వేషన్లు కల్పించామని సంజీవ్ కుమార్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలను అవమానించారని, చిన్న చిన్న పరికరాలను ఇచ్చి చేతులు దులుపుకున్నారని చెప్పారు. పత్తికొండ నియోజకవర్గంలో టమాటా పరిశ్రమ తీసుకొస్తామని నారా లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.
చంద్రబాబు నాయుడి హయాంలో పత్తికొండకు ఏమి చేశారో చెప్పాలని సంజీవ్ కుమార్ నిలదీశారు. టీడీపీ హయాంలో రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు అభివృద్ధి చేస్తామని చెప్పి, కర్నూలు పార్లమెంట్ ప్రజలను దొంగ జీవోలతో మోసం చేశారని అన్నారు. రాయలసీమలోని కర్నూలు పార్లమెంట్ ను ఎడారిగా తయారు చేశారని అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో 60 శాతం బీసీలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందని సంజీవ్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయం ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని, ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని తెలిపారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా అవినీతి కార్యకలాపాలు చేశారని అన్నారు.