Maharashtra Politics: మహారాష్ట్రలో పాచికలు మారుస్తున్న శరద్ పవార్.. విపక్షాలకు దూరంగా, బీజేపీకి దగ్గరగా అడుగులు
అజిత్ పవార్ ఆశయం అంటూ శరద్ పవార్ వెనకేసుకు రావడం చూస్తుంటే.. ఇదంతా ఆయన డైరెక్షన్లోనే జరుగుతోందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రభుత్వం కూడా శరద్ పవార్ సూచన మేరకే ఏర్పడిందని స్వయంగా దేవేంద్ర ఫడ్నవీసే చెప్పారు

Sharad pawar and Ajit pawar
Maharashtra Politics: మహారాష్ట్రలో సీనియర్ రాజకీయ నాయకుడైన శరద్ పవార్ రాజకీయ ఎత్తుగడులు ఊహకందని విధంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరితో సఖ్యతగా ఉంటారో, ఎందుకు ఉంటారో పూర్తి ఫలితాలు వచ్చే వరకు అంచనా వేయడం సాధ్యం కాదు. 2014 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం శరద్ పవార్ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి అయిన అజిత్ పవార్ ఏకంగా బీజేపీతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, ప్రభుత్వం కూలిపోవడం.. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే.
ఇక తాజా పరిస్థితులు కూడా ఇలాగే కనిపిస్తున్నాయి. బీజేపీతో చేతులు కలిపేందుకు అజిత్ పవార్ ఆసక్తి చూపిస్తున్నారు. ఉన్నట్టుండి నరేంద్రమోదీని, బీజేపీని పొగుడుతుండడమే ఈ పరిణామాలకు ఉదహారణ. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడలేనని, ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి అయిపోవాలంటూ అజిత్ పవార్ గట్టిగానే చెప్తున్నారు. ఈ పరిణామాల మధ్య శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ‘‘ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే చేసి తీరాలి. ఒక వేళ స్టాండ్ తీసుకోవాల్సి వస్తే మాత్రం గట్టిగానే నిలబడతాం. దీనికి సంబంధించి ఇప్పటికైతే ఎలాంటి చర్చలు జరగనందున దీనిపై మాట్లాడటం సరికాదు’’ అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘రాజకీయాల్లో చాలా ఆశలు ఉంటాయి. అది సర్వసాధారణం. తప్పేం కాదు కూడా. అతడు (అజిత్ పవార్) తన కోరికను బహిరంగంగానే వెల్లడించాడు. తన ఆశయంపై నిజాయితీగా ఉన్నాడు. రాష్ట్ర అభివృద్ధి పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. ప్రస్తుతం వ్యవసాయ సంక్షోభాలు, రైతు సమస్యలపై ఎవరూ దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం. మీడియాలో అజిత్ పవార్ గురించిన పుకార్లు, ఊహాగానాలకు బదులు ఈ అంశాలు ఎజెండాలో ఎక్కువగా ఉండాలి’’ అని అన్నారు.
అజిత్ పవార్ పార్టీని చీల్చి బీజేపీతో జతకడతారనే వార్తలు గుప్పుమంటున్నప్పటికీ.. అజిత్ పవార్ ఆశయం అంటూ శరద్ పవార్ వెనకేసుకు రావడం చూస్తుంటే.. ఇదంతా ఆయన డైరెక్షన్లోనే జరుగుతోందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రభుత్వం కూడా శరద్ పవార్ సూచన మేరకే ఏర్పడిందని స్వయంగా దేవేంద్ర ఫడ్నవీసే చెప్పారు. ఆయనకు తెలియకుండా అజిత్ పవార్ అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పలేం. ప్రస్తుతం ముఖ్యమంత్రి కావాలంటూ చేసిన వ్యాఖ్యలు కూడా శరద్ పవార్ సూచన మేరకే జరిగాయని కూడా అంటున్నారు.
ఒక పక్క విపక్షాలు అదానీ గ్రూపు వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తుంటే.. దాన్నంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. అంతే కాకుండా రెండు రోజుల క్రితం ఏకంగా అదానీతోనే సమావేశం అయ్యారు. ఇక అజిత్ పవర్ బీజేపీని మోదీని పొగడటం వెనుక రాజకీయ ఎత్తుగడ ఏంటనే దానిపై భిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చిన శరద్ పవార్.. తాజాగా విపక్షాలకు వ్యతిరేకంగా బీజేపీకి దగ్గరవుతుండడం గమనార్హం.