Rahul on Pawar: శరద్ పవార్ ప్రధానమంత్రి కాదు.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలు అదానీ గ్రూప్‌పై జేపీసీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పవార్ మాట్లాడుతూ.. జేపీసీ విచారణలో ప్రభుత్వం నుంచి ఎక్కువ మంది ప్రమేయం ఉన్నందున దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు

Rahul on Pawar: అదానీ గ్రూప్ వ్యవహారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడుతున్నారు. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మాత్రం.. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని పలుమార్లు కలిశారు. అయితే దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. శరద్ పవార్ ప్రధాని కాదని అన్నారు.
దాదాపు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ అదానీ గ్రూప్ వ్యవహారంపై తరుచూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. అయితే అదే కూటమిలోని శరద్ పవార్ మాత్రం అందకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అయితే దీనిపై పవార్ ను ప్రశ్నిస్తారా అని రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించింది. దీనికి రాహుల్ స్పందిస్తూ.. ‘‘నేను ఆయనను (పవార్‌ను) ఎలాంటి ప్రశ్న అడగలేదు. ఎందుకంటే ఆయనేమీ భారత ప్రధాని కాదు. అదానీని శరద్ పవార్ రక్షించడం లేదు. ఆయనను రక్షిస్తున్నది ప్రధాని మోదీ. అందుకే ఈ ప్రశ్న శరద్ పవార్‌ని కాకుండా మోదీని అడిగాను. ఆయన (శరద్ పవార్) దేశానికి ప్రధాని అయి ఉంటే, నేను ఆయనను ప్రశ్నించి ఉండేవాడిని’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: Biden in Israel: ఆ లక్ష్యంతోనే ఇజ్రాయెల్ వచ్చిన బైడెన్.. అంతలోనే షాక్ ఇచ్చిన జోర్డాన్
కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలు అదానీ గ్రూప్‌పై జేపీసీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఇంతకు ముందు ఒక సందర్భంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. జేపీసీ విచారణలో ప్రభుత్వం నుంచి ఎక్కువ మంది ప్రమేయం ఉన్నందున దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా అనేక పార్టీలు ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)కి వ్యతిరేకంగా వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పార్టీలు ఏకమయ్యాయి.