లోగుట్టు ఏంటీ : వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో సర్వే టెన్షన్

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 01:02 AM IST
లోగుట్టు ఏంటీ : వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో సర్వే టెన్షన్

Updated On : January 30, 2019 / 1:02 AM IST

విజయవాడ : ఏపీ రాజకీయాల్లో సర్వేల టెన్షన్ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీలు చేస్తున్న సర్వేలు.. ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పలు చోట్ల ఈ సర్వేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతల తీరును అధికార నేతలు తప్పుపడుతుండటం రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రంజుగా మారుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా సర్వే అంశం రాజకీయ వేడిని రగిల్చింది.

 

కృష్ణాజిల్లాలో సర్వే చేస్తున్న స్మార్ట్‌ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఇద్దరు మహిళలు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చారు. వారిని అడ్డుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు.. కంచికచర్ల పోలీసులకు అప్పగించారు. తమ ఓట్లను తొలగించడానికే సర్వే చేస్తున్నారంటూ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. మహిళలు మాత్రం తాము ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసమో సర్వే చేస్తున్నామంటూ స్పష్టం చేశారు. 

జనవరి 25న విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని కుమిలిలో సర్వే నిర్వహిస్తున్న వారిని బొత్స మేనల్లుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మజ్జి శ్రీనివాస్ అడ్డుకున్నారు. సర్వే పేరుతో తమ వర్గం వారి ఆధార్‌ కార్డులు అడుగుతున్నారని ఆరోపించారు. సర్వే చేస్తున్న వారి ట్యాబ్‌లు లాక్కుని వారిని పోలీసులకు అప్పగించారు. అయితే.. సర్వే చేస్తున్న వారి ట్యాబ్‌లను తిరిగి ఇవ్వాలని కోరినా శ్రీనివాస్ స్పందించకపోవడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై బొత్స మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరైనా సర్వేలు చేసుకోవచ్చని, ఐతే.. సర్వేల పేరుతో ఓట్లు తొలగించడం దారుణమని అన్నారు. సర్వేల పేరుతో ఆధార్ కార్డులు అడగుతున్నారన్న బొత్సా.. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బొత్స వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ కౌంటర్‌ ఇచ్చారు. సర్వేలు చేసే హక్కు ఎవరికైనా ఉందన్న ఆయన.. అనుమానాల పేరుతో అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఓట్ల తొలగింపు అంశం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు తెలియకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందే రాజకీయ వాతావరణం ఇలా ఉంటే.. మును ముందు ఇంకెలా ఉంటుదోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.