గుంటూరులో టీడీపీ – బీజేపీ యుద్ధం : మోడీ సభ ఏర్పాట్లపై ఆంక్షలు

  • Published By: chvmurthy ,Published On : February 8, 2019 / 10:03 AM IST
గుంటూరులో టీడీపీ – బీజేపీ యుద్ధం : మోడీ సభ ఏర్పాట్లపై ఆంక్షలు

Updated On : February 8, 2019 / 10:03 AM IST

గుంటూరు: ఫిబ్రవరి 10వ తేదీన గుంటూరు నగరంలోని బుడంపాడు జాతీయ రహదారి వద్ద  జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడి  ప్రసంగించనున్నారు.  ఈ సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లను స్ధానిక నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ సభకు వీవీఐపిలు,విఐపిలు, జాతీయస్ధాయి నాయకులు హాజరు కానున్నారు. అయితే బహిరంగసభకు వచ్చే నాయకులు బస చేసేందుకు హోటల్స్ గాని,  లాడ్జ్ లు గాని ఖాళీలు లేవంటూ హోటల్ సిబ్బంది తెలుపడంతో బిజెపి నాయకులు అవాక్కవుతున్నారు.  టీడీపి ప్రభుత్వం కావాలనే తమకు రూములు ఇవ్వోద్దని హోటల్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసిందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.

రూముల్లేవ్
ఫిబ్రవరి 10 తేదీన మోదీ సభకు హజరయ్యేందుకు వచ్చే  ముఖ్యనేతలు బస చేసేందుకు హోటల్స్ ను సంప్రదిస్తుంటే ఖాళీలు లేవని హోటల్ యాజమాన్యాల నుంచి సమాధానం  రావటంతో  బిజెపి నాయకులు అవాక్కవుతున్నారు. 9, 10 వతేదీలలో భారీ స్ధాయిలో  పెళ్లిళ్లు వుండటంతో  హోటల్ రూమ్ లు ఖాళీలు లేవని  హోటళ్ల నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు.  బీజేపీ నాయకులు మాత్రం కనీసం ఒక్క రూమ్ వున్నా ఫర్వాలేదు, సూట్ రూమ్ అన్నా ఇవ్వమని బతిమలాడుకుంటున్నారు. గుంటూరులో సుమారు 50 హోటల్స్ వరకు వున్నాయి. నవ్యాంధ్ర రాజదాని అమరావతిలో హైకోర్టు ప్రారంభంకావటంతో, హైకోర్టులో పని ఉండే న్యాయవాదులు, కక్షిదారులు సైతం హోటళ్లలోనే బస చేస్తున్నారు. దీనివలన హోటల్స్ కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఢిల్లీ  నుంచి ప్రధాని భద్రతా సిబ్బంది, ఇతర నిఘా అదికారులు కొన్ని హోటల్స్ లో బస చేశారు.

హోర్డింగ్స్ ఖాళీ లేవు
మరోవైపు ప్రధాని సభకు ఆహ్వనం పలుకుతూ స్వాగత ద్వారాలు, హోర్టింగ్ లు, కరెంట్ స్తంభాలపై కట్టేందుకు బ్యానర్లు, ఫ్లెక్సీలు నాయకులు ముందుగానే ప్రింటింగ్ చేయించారు. అవి కట్టేందుకు కూడా హోర్డింగ్ నిర్వాహకులు అంగీకరించడంలేదని బీజేపీ అధికార ప్రతినిది తాళ్ల వెంకటేష్ యాదవ్ ఆరోపిస్తున్నారు. ప్రధాని సభకు హోర్టింగ్ లు, బ్యానర్లు కట్టకుండా టీడీపీ ప్రభుత్వం, నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల పుట్టిన రోజులు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్లెక్సీలు కట్టిన వాటిని తొలగించేందుకు అదికారులు రారని, తమ బ్యానర్లు మాత్రం కట్టొద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని వస్తూ వుంటే హోటల్ రూములు ఇవ్వినివ్వకుండా, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టకుండా టిడిపి ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని స్ధానిక నాయకులు వాపోతున్నారు.