ఆపరేషన్ క్లీనింగ్ : టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం

  • Published By: madhu ,Published On : November 4, 2019 / 12:55 AM IST
ఆపరేషన్ క్లీనింగ్ : టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం

Updated On : November 4, 2019 / 12:55 AM IST

తెలుగుదేశం పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గ్రామ, మండల స్థాయి నుంచి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీలో ఏ పదవైనా సంస్థాగత ఎన్నిక ద్వారానే చేపట్టేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మొత్తం 12 అంశాలు ప్రధాన అజెండాగా సాగే ఈ కార్యక్రమంలో పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను చంద్రబాబు ప్రకటించనున్నారు.

ముందుగా పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పార్టీని మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్‌ చేస్తారు. పార్టీ కమిటీల్లో బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సంస్థాగత ఎన్నికలన్నీ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. అనుబంధ సంఘాల్లో 33 శాతం యువత… 33 శాతం మహిళలు.. 50 శాతం బడుగు, బలహీనవర్గాల వారికి అవకాశం ఇవ్వాలని బాబు ఇప్పటికే నిర్ణయించారు. అలాగే కార్యవర్గంలోకి ఎన్నికైన వారి పనితీరును నిర్ణీత సమయంలోగా పరిశీలించనున్నారు. పనితీరు బాగాలేని వారిని కార్యవర్గంలోని మెజారిటీ సభ్యుల నిర్ణయంతో రీకాల్‌ చేయాలనే కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 1991లో చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఎలాంటి విధానం అమలైందో… దానినే తిరిగి పునరుద్ధరించనున్నారు.

ఇసుక కొరత వల్ల ఇబ్బందులు, నిర్మాణ రంగం కుదేలు, కార్మికుల ఆత్మహత్యలపైనే… సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, గ్రామాల్లో విద్యుత్ కోతలు, ఉపాధిహామీ నిధులు నిలిపివేత, మద్యం ధరల పెంపు, పోలవరం, అమరావతిపై ప్రభుత్వ వైఖరి, వివిధ శాఖల్లో ఉద్యోగుల తొలగింపు, గ్రామ సచివాలయ నియామకాల్లో అక్రమాలపై చర్చించి… పోరాట పంథా ప్రకటించనున్నారు.
Read More : ఇసుక కొరత : బీజేపీ పోరుబాట